-ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
160 రకాల వ్యాపారస్థులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రుణాలు అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డూండి రాకేష్ మాట్లాడుతూ…ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 9 నెలలే అయినప్పటికి, లోటు బడ్జెట్ ఉన్నప్పటికి, వైసీపీ పాలన వల్ల ఉబ్బందులున్నప్పటికి ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. చంద్రబాబు ప్రతి వర్గానికి న్యాయం చేస్తున్నారు. బడుగు, బలహీనవర్గాలకే కాకుండా వెనుకబడిన తరగతులు, ఉన్నత కులాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేయూతనిస్తున్నారు. 9 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం అనేక విజయాలు సాధించింది. చిన్న పిల్లల యూనిఫామ్ లు మార్చారు. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తున్నారు. పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచాం. ఇచ్చిన హామీలు కొన్ని అమలు చేశాం. ఇంకా కొన్ని అమలు పరుస్తాం. వైసీపీ నాయకులు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలోని పోస్టులకు, రీల్స్ కు రాద్దాంతం చేస్తున్నారు. వైసీపీ నాయకులందరూ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరికి భరోసానిస్తోంది. వైసీపీ హయాంలో వ్యాపారస్థులు వ్యాపారం చేయాలంటే హడలిపోయేవారు. దిక్కుతోచని పరిస్థితిలో వ్యాపారస్థులు ఉండేవారు, వ్యాపారస్థులకు చేయూత ఉండేదికాదు. పేరుకే కార్పొరేషన్లు ఉండేవి. కనీసం ఆఫీసులు కూడా ఉండేవికావు. ఒక్క రూపాయి కార్పొరేషన్లకు ఖర్చు పెట్టలేదు. ఏ కార్పొరేషన్ ద్వారా ఎవరికి సహాయం చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కార్పొరేషన్లలో సిబ్బంది వారి కుర్చీల్లో దర్జాగా కూర్చో గలుగుతున్నారు. వారికి చంద్రబాబు ఒక స్థానాన్ని కల్పించారు. ప్రతి కార్పొరేషన్ కు ఒక గుర్తింపు కలిగించారు. అన్ని కులాలవారికి అండగా ఉంటున్నారు. సబ్సిడీ రుణాల కోసం రూ. 385 కోట్లు కేటాయించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆటంకం కలిగింది. సబ్సిడీ రుణాల సమస్యను మంత్రి సవితమ్మ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లాం. సీఎం సానుకూలంగా స్పందించారు. ప్రతి రూపాయి అర్హులకు చెందాలనేదే చంద్రబాబు ఉద్దేశం. ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారస్థులు ఏపీఓబిఎంఎంఎస్ ద్వారా రుణాలకు అప్లై చేసుకోవడానికి వెసలుబాటు కల్పించారు. దరఖాస్తు చేసుకోవడానికి పదవ తేది ఆఖరుగా ఉన్నప్పటికి తేదీని 22కు పెంచారు. గూగుల్ లో ఏపీఓబిఎంఎంఎస్ ఓపెన్ చేస్తే వ్యాపార వివరాలు మెన్షన్ చేసి కావలసిన రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రుణాలు మూడు స్లాబులుగా పెట్టారు. 2లక్షలు, 3 లక్షలు, 5 లక్షల శ్లాబ్ లు పెట్టారు. కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారులకు చేయూతనిస్తూ 2 లక్షలు రుణాలు తీసుకున్నవారికి 75 వేలు సబ్సిడీ, 3 లక్షలకు లక్షా పాతికవేలు సబ్సిడీ, 5 లక్షలు తీసుకున్నవారికి 2 లక్షలు సబ్సిడీ కేటాయిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వ్యాపారస్థులు అనేక బాధలు, ఇబ్బందులు పడ్డారు. పోరాటాలు చేశారు. గతంలో ప్రతి వ్యాపారం వైసీపీ నాయకులే చేయాలనే నిబంధనతో ముందుకెళ్లారు. బెల్లం అమ్ముకుంటుంటే కూడా కేసులు పెట్టారు. చెత్తపై కూడా పన్ను వేశారు. ఫ్లెక్సీలు వేసుకొనే వ్యాపారులపై కూడా వైసీపీ ప్రభుత్వం గతంలో ఆంక్షలు విధించింది. కార్పొరేషన్లు పేద ప్రజలకు అండగా ఉండాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. 145 రకాల సర్వీసెస్ లో రుణాలు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు. ఏపీఓబీఎంఎంఎస్ లో వృత్తి ద్వారా కార్పొరేషన్ లో అప్లికేషన్ ను నమోదు చేసుకోవచ్చు. 16 రకాల పౌల్ట్రీ ఫామ్ తో సహా రుణాలు మంజూరు చేసుకోవచ్చు. ట్రాన్స్ పోర్టు సెక్టార్ లో ఎలక్ట్రికల్ ఆటోలు, ఈ-వ్యాన్లు, ప్యాసింజెర్ ఆటోలకు రుణాలు పొందచ్చు. ఇంకా బుక్స్ బైండింగ్, బ్రిక్స్, చెప్పుల షాపులు, సైకిల్ షాపులు, ఫ్లెక్సీ ప్రింటింగ్స్, కిరాణా కొట్టు వంటి వాటికి 160 రకాల వ్యాపారస్థులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ లో ఏపీఓబీఎంఎంఎస్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర బడ్జెట్ లో సబ్సిడీ రుణాల కోసం రూ. 385 కోట్లు కేటాయించడం సంతోషదాయకం. చిరువ్యాపారస్థులకు అండగా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ నిర్ణయం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ వివరించారు.