-నిన్న-నేడు-రేపు ఎప్పుడూ మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
-ఏడాదిలో 1.75 లక్షల మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేస్తాం.
-33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైతే 75 మంది ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వస్తారు
-మే నెలలో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా రూ.15 వేల చొప్పున ఇస్తాం
-డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం
-శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘టీడీపీ, మహిళలది అన్నాచెల్లెళ్ల బంధం. మహిళా సాధికారతతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది. మహిళా సాధికారత ప్రారంభమైంది టీడీపీతోనే ప్రారంభమైంది. నిన్న, నేడు, రేపు ఎప్పుడూ వారి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఆనాడు ఎన్టీఆర్ మగవారితో సమానంగా మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. నేను డ్వాక్రా స్థాపించి వారి ఆర్థిక ప్రగతికి బాటలు వేశాం. ఏడాదిలో లక్షా 75 వేలమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం’ అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళా సాధికారతపై శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
మహిళలను దృష్టిలో పెట్టుకునే ప్రతి కార్యక్రమం
మన జనాభాలో 50 శాతం మహిళలే ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా, ప్రపంచమంతా నాగరికత వైపు పయనిస్తున్నా ఇంకా మహిళా పట్ల వివక్ష కొనుసాగుతుండటం బాధాకరం. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కానీ, ఏపీలోని ఎన్డీఏ కానీ ఆడబిడ్డల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. మహిళా సాధికారతతోనే ఏదైనా సాధ్యమవుతుంది. ఎన్టీఆర్ మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఏ కార్యక్రమం ప్రారంభించినా అందులో ప్రత్యేకంగా మహిళలను దృష్టిలో పెట్టుకునేవాళ్లం. మగవారితో సమానంగా మహిళలకు హక్కులు కల్పించడంతో పాటు, ఆర్థికంగా, సామాజికంగా వారిని పైకి తీసుకువచ్చినప్పుడే మన వ్యవస్థ బాగుపడుతుంది. చిన్నప్పుడు తల్లిదండ్రులు, పెళ్లయ్యాక భర్త, వృద్ధాప్యంలో పిల్లలపై మహిళలు ఆధారపడతారు. నేటికీ మహిళపై ఇంకా చిన్నచూపు ఉంది.
ఆస్తి కోసం తల్లీ,చెల్లిని గెంటిన వారా మాపై విమర్శలా?
1986లో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారు. 2005లో కేంద్రం దీన్ని చట్టం చేసింది. అయితే మన రాష్ట్రంలో తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకూ సభలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని తల్లినీ, చెల్లినీ గెంటేసిన వారి వల్ల రాష్ట్రానికి, ముఖ్యంగా మహిళలకు ఒనగూరేదేమీ లేదు. ఆస్తి ఇవ్వనని కోర్టుకు పోయిన వ్యక్తికి మహిళలపై మాట్లాడే హక్కు ఎక్కడిది? రాజకీయాల్లో మనం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు స్పూర్తిగా నిలవాలి. అమరావతి ఇవాళ బతికిందంటే మహిళలు చూపిన చొరవే కారణం. 29 వేలమంది రైతులు 34 వేల ఎకరాల భూమిని స్వచ్చందంగా రాజధాని కోసం ఇచ్చారు. ప్రపంచంలో ఇంత భూమి ఎక్కడా ఇవ్వలేదు. కానీ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. ఇదే అసెంబ్లీలో భూమి ఇచ్చిన రైతులను అవహేళన చేశారు. ఐదేళ్లూ అమరావతి మహిళలు వీర వనితల్లా పోరాడారు. వారి ఇళ్లపై డ్రోన్‌లు ఎగరేసి పైశాచిక ఆనందం పొందారు. వీళ్లు మనుషులు కాదు. న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో తిరుపతి వరకూ కార్యక్రమం నిర్వహిస్తే కనీసం వారికి భోజనానికి దొరక్కుండా ఇబ్బందులు సృష్టించారు. రోడ్డుపైనే తినాల్సిన పరిస్థితి కల్పించారు.
మహిళలను అన్ని విధాలా ప్రోత్సహించాం
మహిళలను విద్యాపరంగా ప్రోత్సహించేందుకు 1983లో ఎన్టీఆర్ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటరుకు ఒక ప్రాధమిక పాఠశాల, ప్రతి 3 కి.మీకు ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతి 5 కి.మికు హైస్కూల్, మండలానికో జూనియర్ కాలేజీ, ప్రతి డివిజన్ కో ఇంజనీరింగ్ కాలేజీ, ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేశాం. 1995లో నేను సీఎం అయ్యాక విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పెట్టాలని నిర్ణయించాను. ఆ నిర్ణయాన్ని చాలామంది విమర్శించారు. నాడు నేను తీసుకున్న రిజర్వేషన్ల నిర్ణయంతో ఆడబిడ్డలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వరకట్నం సమస్యలు లేవు. నేడు ఆడపిల్లలకే ఎదురు కట్నాలు ఇస్తున్నారు. 1996లో గ్రూప్ వన్ కు సెలక్టయిన సూర్యకుమారి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మిగా భావించి రూ.5 వేలు బ్యాంకులో డిపాజిట్ చేసి 18 ఏళ్ల తర్వాత ఆ డబ్బులను కానుకగా ఇచ్చాను.’ అని గుర్తు చేశారు.
75 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వస్తారు
మహిళలను చదువుల దిశగా ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. 8, 9, 10వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశాం. స్పీకర్‌గా ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చి మహిళలందరినీ గౌరవించాం. నేడు దేశ రాష్ట్రపతి, ఆర్థికమంత్రి మహిళలే. మన ప్రభుత్వంలో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. 175 ఎమ్మెల్యే స్థానాల్లో 21 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవల దళిత యువతిని ఎమ్మెల్సీ చేశాం. ఎన్టీఆర్ 8 శాతంతో మొదలుపెట్టిన మహిళా రిజర్వేషన్లను నేను 33 శాతానికి చేర్చాను. ఇటీవల మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభించింది. రిజర్వేషన్లు అమలైతే చట్టసభకు 75 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉంటారు.
మహిళలు సమర్థవంతంగా పని చేస్తారు
అమెరికా లాంటి దేశాల్లో కూడా నేటికీ మహిళలకు సమానత్వం లేదు. ఉమ్మడి ఏపీలో కండెక్టర్లుగా మహిళలను నియమించాం. వాళ్లు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు మహిళల పేరుమీదనే ఇచ్చాను. కట్టెల పొయ్యిపై నా తల్లి పడుతున్న కష్టం చూసి దీపం పథకం తెచ్చాను. దేశంలో అత్యధికంగా 65 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. దీపం 2 కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. పసుపు కుంకుమ కింద ఒక్కో డ్వాక్రా మహిళకు రూ. 10 వేల చొప్పున రూ.9,689 అందించాం. స్త్రీ నిధి కింద రూ. 4,440 కోట్ల ఆర్థిక సాయం చేశాం. తల్లిబిడ్డా ఎక్స్ ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, తల్లికి వందనం, అన్న అమృత హస్తం, బాలామృతం, బాలికలకు రక్ష, పెళ్లికానుక, గిరి గోరుముద్దలు, ఫుడ్ బాస్కెట్, మహిళలకు 11 రకాల ఉచిత వైద్య పరీక్షలు, మహిళల గౌరవాన్ని కాపాడేందుకు మరుగుదొడ్లు, సామూహిక శ్రీమంతాలు నిర్వహించాం. మహిళల ఆరోగ్యం, భద్రత కోసం అనేక కార్యక్రమాలు తెచ్చాం. తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాం .
ఆడవారికి పెత్తనం ఇస్తున్నారని నాపై విమర్శలు చేశారు
డ్వాక్రా సంఘాల స్థాపనతో మహిళల జీవితాల్లో వెలుగులు తెచ్చాం. 8 నుంచి 10 మంది సంఘంగా ఏర్పడి రూపాయి వారు పొదుపు చేస్తే నేను రూపాయి ఇచ్చేవాణ్ణి. ఆడవారికి పెత్తనం ఇస్తున్నానంటూ నన్ను చాలామంది విమర్శించారు. ఈ 30 ఏళ్లలో డ్వాక్రా, మెప్నా సభ్యులు లేని ఇల్లు లేదు. రాజకీయ నేతలు, అధికారులంతా వారిపైనే ఆధారపడుతున్నారు. డ్వాక్రా తెచ్చినందుకు గర్వపడుతున్నాను. ప్రకృతి వ్యవసాయంలో మహిళలు ముందున్నారు. డ్వాక్రా మహిళలపై ఉన్న నమ్మకంతోనే 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. 2014-2019 మధ్య డ్వాక్రా మహిళలకు రూ. 8,500 కోట్లు రుణమాఫీ చేశాం.
ఈ 9 నెలల్లో మహిళకు ఆర్థిక చేయూత అందించాం
ఈ 9 నెలల్లో 7,338 స్వయం సహాయక సంఘాలను, 18 జిల్లా అర్బన్ సమాఖ్యలను ఏర్పాటు చేశాం. 4,91,221 మంది డ్వాక్రా గ్రూపులకు రూ.4,217 కోట్ల స్త్రీ నిధి రుణాలు ఇచ్చాం. బ్యాంకు లింకేజీ ద్వారా 51 లక్షల మందికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.29,486 కోట్లు పట్ణణ ప్రాంతాల్లో రూ. ఒక లక్షా 4 వేల 578 కోట్లు అలాగే మెప్నా గ్రూపులకు రూ. 13,860 కోట్లు ఇచ్చాం. 44 ,144 మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ. 238 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. మహిళా వీధి వ్యాపారులకు రూ. 235 కోట్లు అందించాం. డిజిటల్ మార్కెట్ లో 9241 మందికి శిక్షణ ఇచ్చాం. నెల్లూరు జిల్లాలో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ కింద రూ.9 లక్షలు ఖర్చు చేశాం. విశాఖ, విజయవాడ, మంగళగిరి, ఒంగోలు, పిఠాపురం, కుప్పం, శ్రీకాకుళంలోనూ త్వరలో ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలోని 10 పట్టణాల్లో టిడ్కో లైవ్ లీ హుడ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. రూ. లక్ష కంటే ఎక్కువ ఆదాయం ఉండే లక్ పత్ దీదీ కార్యక్రమంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షలమంది మహిళలు పట్ణణ ప్రాంతాల్లో 20 లక్షలమంది మహిళలు లక్షాధికారులుగా ఉన్నారు. కోటీ 16 లక్షల డ్వాక్రా సభ్యుల్లో 30 లక్షల మంది లక్ పత్ దీదీ కింద ఉన్నారంటే గర్వంగా ఉంది. రాష్ట్రంలో 2 కోట్ల 50 లక్షల మంది మహిళలు ఉండగా వారిలో కోటీ 16 లక్షలమంది డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు. 2 లక్షల 74 వేల 680 మెప్నా సంఘాలు ఉండగా వాటిలో 28 లక్షల 10 వేల 708 మంది సభ్యులుగా ఉన్నారు. వారంతా రూ. 13 వేల 860 కోట్లు బ్యాంకు లింకేజీ ద్వారా సాయం పొందారు. వచ్చే ఏడాదికి 15 వేల కోట్ల రుణాలు అందించడం టార్గెట్ గా పెట్టుకున్నాం. సెర్ప్ కింద డ్వాక్రాలో గ్రామీణ ప్రాంతాల్లో 8 లక్షల 48 వేల 497 సంఘాలు ఉండగా వీటిలో 88 లక్షల 31 వేల 116 మంది సభ్యులు ఉన్నారు. వారంతా రూ. 33 వేల 942 కోట్లు రుణాలు తీసుకున్నారు. వచ్చే ఏడాదికి రూ. 50 వేల కోట్లు రుణాలు టార్గెట్ పెట్టుకున్నాం. రెండూ కలిపి చూస్తే 11 లక్షల 23 వేల 177 సంఘల్లోని కోటీ 16 లక్షల 41 వేలమంది సభ్యులకు…రూ. 65 వేల కోట్ల రుణాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. సఖి నివాస్ కింద 23 వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు ఏర్పాటు చేశాం. 4,500మంది అందులో నివాసం ఉంటున్నారు. పబ్లిక్ ప్లేస్ లలో 304 బేబీ ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. 5 లక్షల 544 మందికి బాలసంజీవని పథకం ద్వారా లబ్ధి చేకూర్చుతున్నాం. ఎన్టీఆర్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ద్వారా కుట్టు మిషన్లు, బ్యూటీ థెరపీ, నర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేట్లర్లకు ట్రైనింగ్ ఇస్తున్నాం.
పింఛన్లలోనూ మహిళలే అధికం
63 లక్షల 36 వేల 932 మందికి పెన్షన్లు ఇస్తుండగా అందులో 50 శాతంపైగా మహిళలే. 37 లక్షల 39 వేల 522 మంది మహిళలు పెన్షన్లు అందుకుంటున్నారు. ఒక్క మహిళలకే పెన్షన్ల కింద నెలకు రూ.1,543 కోట్లు ఖర్చు చేస్తున్నాం. లక్షా 77 వేల 523 మంది ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్నాం. గతంలో ఎవ్వరూ ఇలా ఇవ్వలేదు. ఒకప్పుడు భర్త చనిపోతే వితంతు పెన్షన్ అందేదికాదు. ఒంటరి మహిళలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో వితంతు పెన్షన్లు ప్రవేశపెట్టాం. వీరికి నెలకు రూ. 72 కోట్లు వ్యయం చేస్తున్నాం. భర్త చనిపోయిన నెలలోనే పెన్షన్ ఇచ్చిన ఘనత టీడీపీదే. 15 లక్షల 82 వేల 389 మంది వితంతువులకు రూ. 685 కోట్లు ఆర్థిక సాయం చేస్తున్నాం. 10 లక్షలమంది మహిళలకు ఉపయోగపడేలా..రూ. 4,400 కోట్ల రుణాలు, సబ్సిడీలు ఇచ్చాం. ఒకే రోజున 3 లక్షల 80 వేల లావాదేవీలు, రూ. 5 కోట్ల విలువైన ఉత్పత్తులు, 35,220 డ్వాక్రా ఉత్పత్తులను ఆన్ లైన్ లో మార్కెట్ చేశాం.
మహిళలతో 200 అవులెట్‌ల ఏర్పాటు
డ్వాక్రా ఉత్పత్తులు ప్రపంచమంతా అమ్మకాలు సాగిస్తున్నాయి. అరకు కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. నేడు గిరిజన ప్రాంతాల్లో తయారుచేసే కాఫీకి అంతర్జాతీయంగా పేరొచ్చిదంటే 30 ఏళ్ల క్రితమే మేం తీసుకున్న చర్యలే కారణం. ఇటీవల ప్రధాని మోదీ అరకు కాఫీపై పెట్టిన ట్వీట్ ప్రజల్లోకి బాగా వెళ్లింది. నాంది ఫౌండేషన్ కింద అరకు కాఫీ ప్యారిస్ లో పెట్టారు. దాన్ని మహేంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్రా హ్యాండిల్ చేస్తున్నారు. ఇటీవల మన తెలుగు వ్యక్తి వర్మ….నేచర్ అరకు కాఫీని ప్రపంచమంతా ప్రమోట్ చేస్తున్నాడు. 200 వరకూ అరకు కాఫీ అవుట్ లెట్స్ పెట్టేందుకు డ్వాక్రా సంఘాలతో ఎంవోయూ చేసుకున్నారు. అరకు కాఫీ, ఫిల్టర్ కాఫీ, చాక్లెట్లు వంటివి ఉత్పత్తి చేస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ పెట్టారు. మన అసెంబ్లీలో కూడా పెట్టాలని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ను కోరుతున్నాను. అరకు కాఫీని ఆర్గానిక్ కాఫీగా ప్రమోట్ చేస్తాం.
మహిళల కోసం 24 ఒప్పందాలు
మహిళలను పారిశ్రామివేత్తలుగా తయారుచేసేందుకు 24 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులపై డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వడానికి ఒప్పందం జరిగాయి. అమూల్ వలే…మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు ఒక బ్రాండ్ తీసుకొచ్చి ప్రమోట్ చేస్తే అంతర్జాతీయంగా మంచి పేరు వస్తుంది. మన ఆడబిడ్డలు తయారుచేసే ఉత్పత్తులు ప్రపంచంలోని అన్ని మార్కెట్ లో పెడతాం. బనానా ఫైబర్ తో బ్యాగులు , శారీస్ , బొమ్మలు తయారు చేస్తున్నారు. గుర్రపు డెక్కతో కూడా బ్యాగులు తయారు చేస్తూ సంపద సృష్టిస్తున్నారు. ర్యాపిడో తో ఒప్పందం చేసుకున్నాం . వెయ్యి ఎలక్ట్రిక్ వాహనాలను మహిళలే నడపనున్నారు. దీని ద్వారా మహిళలకు అదనపు ఆదాయం వస్తుంది. హోం ట్రయాంగిల్ యాప్ ద్వారా మహిళలకు ఆన్ లైన్ ట్రైనింగ్ ఇప్పిస్తాం. నేషనల్ అప్రన్ షిప్ స్కీమ్ కింద 25 వేలమందికి ఎంపిక చేసి శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలీప్ సంస్థ విజయవాడ, అనాకపల్లి, కుప్పంలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టనున్నారు. లక్షా 50 వేల మందికి కుట్టుమిషన్లు ఇప్పిస్తున్నాం. 42 వేలమంది ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ చెల్లిస్తున్నాం. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాం. 55 వేలమంది అంగన్వాడీ కార్యకర్తలు, 48వేల మంది అంగన్వాడీ ఆయాలకు గ్యాట్యుటీ పెంపుకు నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది పిల్లలను కన్నా ప్రసూతి శెలవులు ఇస్తాం. ఈనెల ఉగాది పర్వదినం నాడు పీ4 ప్రారంభిస్తున్నాం. పీ3 ద్వారా సంపద సృష్టించాం. పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు పీ4 తెస్తున్నాం. ఆర్థికంగా ఉన్నతిలో ఉన్న 10 శాతం మంది కింద ఉన్న 20 శాతం మందిని దత్తత తీసుకుని అండగా నిలవాలి. ప్రతి ఎమ్మెల్యే కనీసం వెయ్యి మంది డ్వాక్రా, మెప్నా సంఘాలను ఏడాదిలోగా పారిశ్రామిక వేత్తలుగా తయారుచేసే బాధ్యత తీసుకోవాలి.
ఎక్కడున్నా పట్టుకొచ్చి శిక్షిస్తాం
మహిళా భద్రతకు 13 రకాల ఫీచర్స్ తో శక్తి యాప్ తెచ్చాం. 164 శక్తి టీమ్స్ ఏర్పాటు చేశాం. డ్రగ్స్, గంజాయి లేని రాష్ట్రంగా ఏపీని తయారుచేస్తాం. చి మహిళా భద్రత, హక్కులు , గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. మారుమూల పల్లెలో ఉండే ఆడబిడ్డ పట్టణాలకు వచ్చి గౌరవంగా ఉద్యోగం చేసుకునేలా చేస్తాం. గత ప్రభుత్వంలో ఒక్కసారైనా ప్రజా సమస్యలపై చర్చించలేదు. ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ …నేను ముఖ్యమంత్రి అయ్యాక సభను హుందాగా నడుపుతానని చెప్పాను. ఎవ్వరైనా ఆడబిడ్డల జోలికొస్తే అలాంటి సైకోలను వదిలిపెట్టను. సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడితే ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకొచ్చి శిక్షిస్తాం. చిత్తూరులో ఒక ఇంటిలో దొంగతనం కేసును రెండున్నర గంటల్లో ఛేదించిన పోలీసులను అభినందిస్తున్నాను.
బాల్య వివాహాలను అరికడతాం
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీపం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. 96 లక్షల 66 వేల 552 మందికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. రూ.753 కోట్లు ఇందుకోసం ఖర్చు చేస్తున్నాం. ఎందరు పిల్లలుంటే అందరికీ మే నెలలో తల్లికి వందనం ఇస్తాం. 2047 వరకూ మన దేశానికి ఇబ్బంది లేనప్పటికీ జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. సింగపూర్ వంటి దేశాలు ఇతర దేశాల్లోని నిపుణులను దిగుమతి చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హత లేదన్నాం. ఇప్పుడు ఇద్దరు పిల్లలకంటే తక్కువ ఉంటే పోటీకి అర్హులు కాదని బిల్లు తేవాల్సి ఉంది. సంపదకు , జనాభాకు వైరుధ్యం ఉంది. డబ్బున్నవాళ్లంతా…ఇండస్ట్రీ పెట్టడం తేలిక…పిల్లలను కని పెంచడం కష్టం అంటున్నారు. ఒకప్పుడు ఎయిడ్స్ గురించి మాట్లడాలంటే సిగ్గుపడేవాళ్లు. బ్రేక్ సైలెన్స్ -టాక్ ఎబౌట్ ఎయిడ్స్ అని దేశంలో నేనే మొదట చెప్పాను. ప్రజల్లో చైతన్యం తెచ్చాం. చాలావరకూ ఎయిడ్స్ ను కంట్రోల్ చేశాం. ప్రతి ఆడబిడ్డ ఇద్దరు కంటే ఎక్కువమందిని కనాలి. ప్రతి ఆఫీస్ లో చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. మహిళలకు శానిటరీ నాప్కిన్లు అందిస్తాం. సిజేరియన్లు ఎక్కువయ్యాయి. వీటికితోడు ట్యుబెక్టమీ ఆపరేషన్లు కూడా వెంటనే చేయడంతో మహిళల ఆరోగ్యం దెబ్బతింటోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో 70 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. నార్మల్ డెలివరీస్ ను ప్రోత్సహించాలి. ప్రజల్లో చైతన్యం తెచ్చి బాల్య వివాహాలను కూడా పూర్తిగా అరికట్టాలి. డ్వాక్రా మహిళలు తీసుకునే రూ. 60 వేల కోట్ల రుణాల్లో 30 వేల కోట్లు ఉత్పత్తులపై పెడితే భారీగా ఆదాయం వస్తుంది. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ ప్రెన్యూర్ ఉండాలి. ప్రోత్సహించాలేకానీ ఓ శక్తిగా డ్వాక్రా మహిళలు తయారవుతారు.
వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఏపీ మా లక్ష్యం
గత పాలకుల విధ్వంసంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఇది ప్రజా ప్రభుత్వం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. సరస్వతీ సిమెంట్స్ విషయంలో జగన్ రెడ్డి , విజయమ్మ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. 2021లో 51.01 షేర్లు విజయమ్మకు ట్రాన్స్ ఫర్ చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. 2024లో విజయమ్మకు షేర్స్ ట్రాన్స్ ఫర్ కాగా వాటిని ఆమె కూతురికి ఇచ్చింది. దానిపై జగన్ రెడ్డి కేసు వేశాడు. విజయమ్మ మళ్లీ కోర్టుకు వెళ్లి అఫిడవిట్ వేసింది. ఆడబిడ్డలకు ద్రోహం చేయడం నేరం కాదా… ఇదో కేస్ స్టడీ . ప్రజల్లో చైతన్యం తేవాలనే ఈ విషయం చెబుతున్నాను. తల్లి, చెల్లికి న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడు.. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఒక వెయ్యిమంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేయాలి. ఇది బాధ్యతగా తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే చేయూతను అందిపుచ్చుకుని డ్వాక్రా సభ్యులు ముందుకెళ్లాలి. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.