– రైతు ప్రయోజనాలే లక్ష్యంగా కార్యాచరణ ఉండాలి
– సరైన ప్రణాళిక, పటిష్ట సమన్వయం, నిరంతర పర్యవేక్షణ ముఖ్యం
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి విజయవంతంగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయిందని.. ఇదే విధంగా రబీ (2024-25) సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ట ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ, ఎండీ డా. మంజీర్ జిలానీ.. రబీ ధాన్యం సేకరణ సన్నద్ధతపై వర్క్‌షాప్‌తో పాటు ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్‌స్పెక్షన్ మాడ్యూల్, బఫర్ గోదాముల వినియోగం, కాగిత రహిత డిజిటల్ లావాదేవీలు తదితరాలపై వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. పౌర సరఫరాలు, వ్యవసాయం, సహకార, రవాణా తదితర శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చేపట్టాల్సిన చర్యలపై వీసీ, ఎండీ మంజీర్ జిలానీ పలు సూచనలు చేశారు. అదే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ-కేవైసీ తదితర అంశాలను సౌరభ్ గౌర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఖరీఫ్‌కు సంబంధించి 149 రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్‌కే) ద్వారా 16,353 మంది రైతుల నుంచి దాదాపు రూ. 257 కోట్ల విలువైన 1,10,738 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని.. ఇదేవిధంగా రబీకి కూడా సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఈ-పంట నమోదు ఆధారంగా చూస్తే రబీలో 20,422 హెక్టార్లలో వరి వేయడం జరిగిందని.. 1,60,413 మెట్రిక్ టన్నుల మేర ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశముందని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని లక్ష్యాల మేరకు మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణకు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ఛైర్మన్‌గా ఆర్‌డీవోలు, పౌర సరఫరాల డీఎం, డీఎస్‌వో, డీఏవో తదితర అధికారులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని.. ధాన్యం సేకరణకు సరైన ప్రణాళిక, పటిష్ట సమన్వయం, నిరంతర పర్యవేక్షణ ముఖ్యమని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో ఉన్న రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేసే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ఇందుకుగాను వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకొని పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, పౌరసరఫరాల డీఎం ఎం.శ్రీనివాసు, డీఎస్‌వో ఎ.పాపారావు, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, జిల్లా సహకార అధికారి ఎస్.శ్రీనివాసరెడ్డి, ఆర్‌టీవో ఆర్.ప్రవీణ్, జిల్లా అగ్రీట్రేడ్ అండ్ మార్కెటింగ్ అధికారి కె.మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.