– జూన్ 21 వరకు రోజూ ఉదయం ప్రత్యేక యోగా కార్యక్రమాలు
– ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలి
– ప్రతిఒక్కరూ మరో ముగ్గురిని యోగాచరణ దిశగా ప్రోత్సహించాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో కనీసం రెండుకోట్ల మందికి యోగాలో ప్రవేశం లక్ష్యంతో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని.. ఇందులో భాగంగా జిల్లాలోనూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో రోజూ ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా గురువారం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డు-సత్యనారాయణపురం వద్ద ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమం జరిగింది. ఇందులో కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు పాల్గొని యోగాసనాలను సాధన చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మనిషి జీవన నాణ్యతను పెంచేందుకు, శ్రేయస్సుకు యోగా గొప్ప మార్గమని.. రోజూ యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతివృత్తం ఆధారిత యోగా సెషన్లతో పాటు వివిధ పర్యాటక ప్రాంతాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ట్రైనర్లు, పౌరుల రిజిస్ట్రేషన్‌కు ఏర్పాటు చేస్తున్నామని.. ఈ నెల రోజుల పాటు యోగాసనాల అభ్యసనతో పాటు ఆసనాల ప్రదర్శన, సూర్య నమస్కార్, ప్రాణాయామ ప్రదర్శన, గ్రూప్ యోగా, ఆర్టిస్టిక్ యోగా.. ఇలా వివిధ విభాగాల్లో పోటీలు కూడా నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో జరిగే కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. జీవితాంతం యోగాను ఆచరిస్తూ, ఆచరింపజేస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవాలని, ప్రతిఒక్కరూ మరో ముగ్గురిని యోగాచరణ దిశగా ప్రోత్సహించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
మన చారిత్రక సంపదను సద్వినియోగం చేసుకోవాలి: మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర
యోగా అనేది భారతీయ వారసత్వ, చారిత్రక సంపద అని.. ఈ సంపదను సద్వినియోగం చేసుకొని.. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారుకావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. యోగా అభ్యసనను ఏ ఒక్క రోజుకో పరిమితం చేయకుండా జీవితాంతం ప్రతిరోజూ యోగాను ఆచరించడం వల్ల కొత్త ఉత్తేజంతో మంచి ఫలితాలు సాధించొచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ సర్వాణి మూర్తి, అదనపు కమిషనర్ డా. డి.చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్.శ్రీనాథ్ రెడ్డి, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, జోనల్ కమిషనర్లు రమ్య కీర్తన, కె.ప్రభుదాస్, కె.షమ్మీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News