– అర్హులైన యువతను ఓటర్లుగా నమోదు దిశగా ప్రోత్సహించాలి
– డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో రాజకీయ పక్షాలు అధికారులకు సహకరించాలని, అర్హులైన యువత ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.
గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్‌వో లక్ష్మీనరసింహం సమావేశం నిర్వహించారు. ఈసీఐ ఆదేశాల మేరకు ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈఆర్‌వో, డీఈవో, సీఈవో తమతమ పరిధిలో ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పక్షాలు వారి బూత్ లెవెల్ అసిస్టెంట్లకు సూచనలు చేసి వారి పరిధిలోని బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకొని అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు సహకరించాల్సిందిగా కోరారు. ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఎవరైనా మరణించినా, శాశ్వతంగా వలస వెళ్లినా వారి పేర్లను బీఎల్‌వోకు తెలియపరచాలన్నారు. ఓటరు జాబితాలో ఏవైనా మార్పులు, ఓటరు కార్డులో ఏవైనా తప్పులు ఉంటే వారి విషయమై ఫారం-8 నమోదు చేసి, సరిచేసేందుకు సహకరించాల్సిందిగా కోరారు. జిల్లాలో ఫారం 6, ఫారం 7, ఫారం 8 అర్జీలకు సంబంధించిన వివరాలను తెలియజేసి సమాచారాన్ని రాజకీయ పక్షాలకు అందజేశారు. రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం నుంచి బాపట్ల జిల్లా వరకు 1 నుంచి 100 నంబర్ల నియోజకవర్గాల వరకు ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో బీఎల్‌వో లేదా బీఎల్‌వో సూపర్‌వైజర్‌కు జూన్ 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో మొదటి విడత శిక్షణ ఉంటుందని ఎన్నికల సంఘం తెలియజేసినట్లు వివరించారు. సమావేశంలో రాజకీయ పక్షాల ప్రతినిధుల సందేహాలను డీఆర్‌వో నివృత్తి చేశారు.
సమావేశంలో ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ సలీమ్, డీవీ కృష్ణ (సీపీఎం), కె.పరమేశ్వరరావు (ఆప్), తరుణ్ కాకాని (బీజేపీ), బి.అనిల్ (టీడీపీ), జె.శ్రీనివాస్ (జనసేన) పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News