Breaking News

అమరావతిలో పేదలకు ఒక్క పీఎంఏవై ఇల్లు కూడా కోరని టీడీపీ ప్రభుత్వం

-కేంద్రం సమాధానంతో బయటపడిన వాస్తవాలు

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పేదల వ్యతిరేక వైఖరి మరోసారి బహిర్గతమైంది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని పేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–అర్బన్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం ఒక్క ప్రతిపాదన పంపలేదని స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీఎంఏవై–అర్బన్ 2.0 కింద 61,084 ఇళ్లకు రూ.882.32 కోట్ల కేంద్ర సహాయం మంజూరైంది. అలాగే 2026 జూన్ 17న జరిగిన కేంద్ర ఆమోద, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని 107 పట్టణ స్థానిక సంస్థలకు మరో 12,370 ఇళ్లను రూ.185.55 కోట్ల కేంద్ర సహాయంతో ఆమోదించింది. అయితే ఈ ప్రతిపాదనల్లో అమరావతికి ఒక్క ఇల్లు కూడా లేకపోవడం గమనార్హం.

పీఎంఏవై–అర్బన్ 2.0 కింద ఇళ్ల మంజూరు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు పంపే ప్రతిపాదనల ఆధారంగానే జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అంటే అమరావతిలో పేదలకు ఒక్క ఇల్లు కూడా రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించలేదన్న విషయం అధికారికంగా రికార్డుల్లో నమోదైంది.

రాష్ట్రంలోని 107 పట్టణాలకు ఇళ్ల కోసం ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వం, రాజధాని అమరావతికి మాత్రం ఎందుకు పంపలేదనే ప్రశ్న ఇప్పుడు ప్రజల ముందుంది. అమరావతి ధనవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రభావశీలుల కోసమేనా? అక్కడ కార్మికులు, దినసరి కూలీలు, పేదలు, బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలకు స్థానం లేదా?

అమరావతి అందరి రాజధాని అని కూటమి ప్రభుత్వం పదేపదే చెబుతున్నప్పటికీ, వారి చర్యలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని ఈ కేంద్ర సమాధానం వెల్లడిస్తోంది. రాజధానిలో పేదలకు ఇళ్లు కల్పించే అవకాశాన్నే రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయేలా చేయడం ద్వారా పేదలను అమరావతి అభివృద్ధికి దూరం పెట్టిందనే విషయం స్పష్టమైంది.

ఒకవైపు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతున్నామని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, మరోవైపు అదే రాజధానిలో పేదలకు కనీసం సొంత ఇంటి అవకాశం కూడా కల్పించేందుకు ముందుకు రాకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సమగ్ర అభివృద్ధిని విశ్వసించే ప్రభుత్వం అయితే రాజధానిలో మొదట పేదలకే గృహాలు కల్పించేలా చర్యలు తీసుకునేది.

ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతిలో పేదల కోసం పీఎంఏవై–అర్బన్ 2.0 కింద ఒక్క ఇంటికైనా ఎందుకు ప్రతిపాదన పంపలేదు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో అసలు నిజం బయటపడింది. అమరావతి నుంచి పేదలను దూరం పెట్టడం యాదృచ్ఛికం కాదు… కూటమి ప్రభుత్వ విధానమే.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *