Breaking News

తెలుగు జాతి ఖ్యాతి, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-మన్యం వీరుడు అల్లూరి స్వగ్రామం పాండ్రంగిలో అడుగుపెట్టడం పూర్వజన్మ సుకృతమని వెల్లడి
-అల్లూరి నడయాడిన ప్రాంతాలను అద్భుత పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని హామీ
-అల్లూరి పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యతను నెరవేరుస్తామని వెల్లడి
-విశాఖను టూరిజం, కల్చర్, సినిమా హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం
-పాండ్రంగిలో అల్లూరి జయంతి వేడుకను స్వయంగా నిర్వహించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ప్రశంసించిన మంత్రి దుర్గేష్

విశాఖపట్నం, పాండ్రంగి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంగ్లేయులపై స్వాతంత్య్ర సమరాన్ని సాగించిన మన్యం వీరుడు, పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు ఆలోచనలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అట్టడుగు వర్గాలను సమున్నత స్థానంలోకి తీసుకురాగలగడమే మనమిచ్చే ఘననివాళి అవుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం విప్లవ జ్యోతి అల్లూరి స్వగ్రామం పాండ్రంగిలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను చిరస్థాయిగా నిలిచేలా, స్మారక కార్యక్రమాలు చేసుకునేలా స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఇచ్చిన ప్రతిపాదనలను పర్యాటక శాఖ పరిగణలోకి తీసుకొని తగు చర్యలు తీసుకుంటుందని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు.గడిచిన ఐదేళ్ల కాలంలో పర్యాటక రంగం ప్రగతికి నోచుకోలేక కుంటుపడిందన్నారు. విశాఖను టూరిజం హబ్ గా, టూరిజం సర్క్యూట్ గా చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ క్రమంలో పలు పర్యాటక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. అల్లూరి సీతారామరాజు పుట్టిన ప్రాంతాన్ని, అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని, విజయనగర శ్రీకృష్ణదేవరాయలు స్థూపాన్ని, స్థానికంగా ఇంకా కొన్ని ప్రాంతాలను కలుపుకొని టూరిజం సర్క్యూట్ గా చేస్తామన్నారు. అల్లూరి జన్మస్థలాన్ని చూడ్డానికి వచ్చే పర్యాటకుడు ఆయన సమాధితో పాటు ఆయన నడయాడిన ప్రాంతాలను, అదే విధంగా ఆ చుట్టుప్రక్కల పర్యాటక ప్రాంతాలని సైతం సందర్శించేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేస్తామన్నారు. తొట్లకొండ, బావికొండ, బొజ్జనకొండ తదితర బౌద్ధారామాలను బుద్ధిస్ట్ సర్క్యూట్ గా ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. ఈ అంశంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో మాట్లాడామన్నారు. రాష్ట్రం పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పర్యాటక ప్రాజెక్టులను రాష్ట్రానికి కేటాయించిందన్నారు. అందులో భాగంగానే సింహాచలం క్షేత్రం అభివృద్ధి చేస్తున్నామన్నారు. దాంతో పాటు ప్రస్తుతం వచ్చిన ప్రతిపాదనలకు సమగ్ర డీపీఆర్ రూపొందించి ఈ ఆర్థిక సంవత్సరంలోనే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు.

తొలినాటి స్వాతంత్ర్య సమరయోధుడికి ప్రాణప్రతిష్ట జరిగిన ప్రాంతంలో అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నాను: మంత్రి కందుల దుర్గేష్

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పాండ్రంగి గ్రామానికి రావడం ఇదే తొలిసారి అన్నారు. తొలి నాటి స్వాతంత్ర్య సమరయోధుడికి పురుడు పోసిన ప్రాంతానికి, ప్రాణప్రతిష్ట జరిగిన స్థలానికి రావడం అద్భుత ఘట్టంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతంలో తాను నిలబడి మాట్లాడటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. పరపీడనలో, పరాయిపాలనలో మగ్గుతున్న భారతమాత దాస్యశృంఖలాలను చేధించడానికి తమ అసువులు బాసిన అనేక మంది త్వాగమూర్తుల త్యాగాల ఫలితంగా మనం నేడు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను అనుభవిస్తున్నామన్నారు. సర్వసత్తాక, సామ్యవాద, గణతంత్ర, లౌకిక, ప్రజాస్వామిక దేశంగా ప్రపంచం ముందు నిలబడగలిగామని గుర్తుచేశారు.ఆ స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి అవకాశం కల్పించిన మహానుభావులను మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాంటి వారిని ప్రాతఃస్మరణీయులు అంటారని పేర్కొన్నారు. అందులో తొలినాటి స్వాతంత్ర్య సమరయోధుడిగా, మానవ హక్కులు కాపాడిన నాయకుడిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి, మన్యంవీరుడు మన అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. మానవ హక్కులు,దళిత, గిరిజన హక్కుల గురించి మాట్లాడుతున్నామంటే దానికి కారణం అల్లూరి సీతారామరాజు అని నేపథ్యాన్ని వివరించారు. మన్యం ప్రాంతంలో గిరిజనులను సమీకరించి సాయుధ పోరాటం చేసి బ్రిటీషర్లపై పోరాడి భారతదేశం స్వాతంత్య్రం అర్జించడానికి కారణమయిన మహోన్నత వ్యక్తి అల్లూరి అన్నారు. ఆ సాయుధ పోరాట పటిమ నేటికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు.25 ఏళ్ల వయస్సులోనే ఉద్యమం మొదలుపెట్టి బ్రిటీష్ పాలకులను గడగడలాడించి రెండేళ్ల అనంతరం పరిసమాప్తం చెందారని వివరించారు.గొరిల్లా యుద్ధరీతుల్లో ఆరితేరిన మహామనిషి అల్లూరి అన్నారు. అల్లూరి తాను బతకాలని అనుకుంటే బ్రిటీష్ వారికి దొరికేవాడు కాదని వివరించారు. తన ప్రజల మాన, ప్రాణాలను కాపాడటం కోసం తుపాకీకి గుండె చూపించి వీరమరణం పొందిన మహనీయుడు, త్యాగశీలి మన అల్లూరి అని పేర్కొన్నారు. ఆయన త్యాగనిరతిని, జీవనవిధానాన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు.

దేశానికి స్వాతంత్య్రం అర్జించి పెట్టిన కారణజన్ములను మననం చేసుకునేలా రాష్ట్ర పండుగగా కార్యక్రమాలు నిర్వహణ:మంత్రి దుర్గేష్

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలతో స్వాతంత్ర్య సిద్ధికి కారణమైన గొప్ప గొప్ప మహానుభావులను మననం చేసుకునేలా రాష్ట్ర పండుగగా కార్యక్రమాలు జరపాలని నిర్ణయించిందన్నారు. ఈ క్రమంలో ఉదయం కృష్ణదేవిపేటలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. మన్యం వీరుడు, పోరాట యోధుడు అల్లూరి స్వగ్రామంలో ఆయనకు ఘనమైన వేడుక నిర్వహించి మననం చేసుకోవాలన్న ఉద్దేశంతో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుండటం సంతోషమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును అభినందించారు.రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేసే తాము అల్లూరి త్యాగనిరతి నుండి, జీవన విధానం నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలోకి తీసుకువస్తే శాంతియుత సమాజస్థాపన జరుగుతుందన్నారు.

విశాఖ గొప్ప నగరం..రాబోయే రోజుల్లో అద్భుత కేంద్రంగా తీర్చిదిద్దుతాం:మంత్రి దుర్గేష్

ప్రకృతి రమణీయతకు చిరునామ విశాఖపట్టణం అని యావత్ లోకానికి తెలుసని మంత్రి దుర్గేష్ అన్నారు. సుదీర్ఘ సముద్రతీరం, అటవీ ప్రాంతం, సుందర భవనాలు, సహజమైన ఓడరేవు, అద్భుత ప్రకృతి రమణీయ దృశ్యాలు కలగవలసిన విశాఖ లాంటి గొప్ప నగరం దేశంలో మరెక్కడా లేదన్నారు. పర్యాటక రంగంలో విశాఖను అద్భుత కేంద్రంగా చేయాలని నిర్ణయించామన్నారు.

ఏపీలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి చర్యలు:మంత్రి దుర్గేష్

రాష్ట్ర విభజన జరిగిన అనంతరం తెలంగాణలోనే సినిమా స్టూడియోలు ఉండిపోయాయని మంత్రి దుర్గేష్ అన్నారు. షూటింగ్ లు మాత్రం ఏపీలో జరుగుతున్నాయని వెల్లడించారు. సినిమాకు సంబంధించిన రెవెన్యూ కూడా ఏపీ నుండే అధికంగా వస్తుంది కానీ అది తెలంగాణ ప్రభుత్వానికి ఉపయోగపడుతుందన్నారు. ఏపీలోనే చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేస్తే స్థానికంగా స్టూడియోలు, రీరికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు ఏర్పాటు చేసుకోగలగాలన్నారు. అందుకు విశాఖ అనువైన ప్రాంతమన్నారు.విశాఖపట్టణం నగరాన్ని పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగం పరంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు.తద్వారా తెలంగాణకు ధీటుగా చలన చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. తెలంగాణ తరహా ఏపీలో ఫిల్మ్ కల్చరల్ సెంటర్ (ఫిల్మ్ నగర్) కేఎస్ రామారావు, కళ్యాణ్, గంటా శ్రీనివాసరావుల కృషితో ఏర్పడిందన్నారు. బౌద్ధారామాల సమీపంలో ఈ ప్రాంతం ఉండటం వల్ల దానికి సంబంధించిన భూముల కేటాయింపు విషయంలో సమస్యలు తలెత్తాయన్నారు. దాన్ని మరో ప్రదేశానికి మార్చారన్నారు. ఫిల్మ్ నగర్ కు కేటాయించిన ల్యాండ్ కు సంబంధించిన లీజు పీరియడ్ ను పర్యాటక రంగంలో ఇచ్చే తరహా 66 ఏళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో చర్చించి తదుపరి కేబినెట్ లో ఆమోదించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే విశాఖ అనువైన ప్రాంతమని, ప్రత్యేకించి భీమిలి అన్నారు.

కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విప్లవయోధుని స్ఫూర్తిని గుర్తుచేశాయి.

కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మాజీ మంత్రి అప్పల నరసింహరాజు , భీమిలి జనసేన పార్టీ ఇంచార్జ్ పంచకర్ల సందీప్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పరుశరామరాజు, ఆర్డీవో, సాంస్కృతిక, పర్యాటక శాఖ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *