-కూటమి పరిపాలన పట్ల ప్రజల్లో చాలా సంతృప్తి ఉన్నది
-పవన్ కళ్యాణ్ శాఖల ద్వారా రాష్ట్రానికి, ప్రభుత్వానికి గౌరవం పెరుగుతోంది
-ఉత్తరాంధ్ర పర్యటనలో ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ కోసం పని చేసే ప్రతీ కార్యకర్తకు సముచిత స్థానం, గౌరవం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా సోమవారం విశాఖపట్నంలోని జనసేన పార్టీ విశాఖ నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాగబాబు నాయకులతో, కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడారు. కూటమి పరిపాలన పట్ల ప్రజల్లో చాలా సంతృప్తి ఉన్నదనే సమాచారం రాష్ట్ర నలుమూలల నుంచి అందుతోందని, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ శాఖల ద్వారా ఆయన చేపడుతున్న అభివృద్ధి పనుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కూటమి ప్రభుత్వానికి గౌరవం పెరుగుతోందని వెల్లడించారు. కొంచెం ముందు వెనుక అయినా కష్టపడిన వారికి పదవులు తప్పనిసరిగా వస్తాయని, పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడు ఎలాంటి పదవులు ఆశించకుండానే పదేళ్లకు పైగా ప్రజాక్షేత్రంలో పని చేసిన విధానాన్ని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు పదవులు ఎలా ఇస్తారు, ఎన్ని ఇస్తారు అనే అంశాలను పవన్ కళ్యాణ్ స్వయంగా సమీక్షిస్తు న్నారని, పార్టీ కోసం పని చేసే ప్రతీ ఒక్కరికీ అవకాశాలు వస్తాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇకపై ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ ఎదుగుదల కోసం ఎక్కువ సమయం కేటాయించి పని చేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో వార్డు స్థాయి, బూత్ స్థాయి నాయకులతో, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అవుతానని, అందరితో మాట్లాడతానన్నారు. కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకొని రాష్ట్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పని చేయాలని కోరారు.
అంతకు ముందు చర్చ కార్యక్రమం ద్వారా నాగబాబు కార్యకర్తలకు, నాయకులకు మాట్లాడే అవకాశం కల్పించారు. కూటమి పరిపాలన పట్ల ప్రజల సంతృప్తికరమైన అభిప్రాయాలను గురించి, పవన్ కళ్యాణ్ తమ శాఖల్లో చేపడుతున్న అభివృద్ధి విధానం ద్వారా వస్తోన్న స్పందన గురించి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిపేరు తీసుకు వస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను గురించి నాయకులు, కార్యకర్తలు వెల్లడించిన అభిప్రాయాలను నాగబాబు స్వయంగా రాసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన విశాఖ సిటీ అధ్యక్షులు, విశాఖ సౌత్ శాసనసభ్యులు వంశీ కృష్ణ యాదవ్, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, డీసీసీబీ చైర్మన్, గాజువాక ఇంచార్జీ కోన తాతారావు, నార్త్ ఇంచార్జీ పసుపులేటి ఉషా కిరణ్, భీమిలి ఇంచార్జీ డా. సందీప్ పంచకర్ల, రాష్ట్ర కార్యదర్శి ప్రశాంతి, డాక్టర్ సెల్ అధ్యక్షులు డా.బొడ్డేపల్లి రఘు, కార్పొరేట్లు, విశాఖ సిటీ వార్డులకు చెందిన అధ్యక్షులు, ఇతర నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News