-టూరిజం హోటళ్లు, రిసార్టుల ప్రైవేటీకరణ విరమించాలి.
-ఎపిటిడిసి ఎంప్లాయిస్ యూనియన్ రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పర్యాటకరంగ హోటళ్లు, ఆస్తులను ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టే చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 18వ తేదీన చలో అసెంబ్లీ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ టూరిజమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ రౌండ్‌టేబుల్ సమావేశం(ఏఐటీయూసీ) నిర్ణయించింది.
ఎపి టూరిజంకు చెందిన ఆస్తుల ప్రైవేటీకరణపై ఈరోజు విజయవాడ, దాసరి భవన్లో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ టూరిజమ్ డవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ)కి చెందిన రూ.10 వేల కోట్ల విలువైన దాదాపు 450 ఎకరాలు విస్తీర్ణం కలిగిన హోటళ్లు, రిసార్టులను ప్రైవేట్‌కు కట్టబెట్టే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని సమావేశం తీవ్రంగా వ్యతిరేకించింది. వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాల నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు హాజరయ్యారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్ఛేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన పర్యాటక రంగంలోని రూ.10 వేల కోట్ల విలువైన 22 హోటళ్లు, రిసార్ట్లు, ఆస్తులను ప్రైవేట్‌పరం చేయడం దుర్మార్గమన్నారు. పర్యాటక రంగంలో పనిచేస్తున్న 1300 మందికిపైగా ఉద్యోగుల కుటుంబాలను నడిరోడ్డున పడేసేలా జీవోలు ఇవ్వడం సిగ్గుచేటని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పర్యాటకరంగ హోటళ్లను ప్రైవేటీకరణచేస్తే ఇక ప్రభుత్వం ఎందుకు?, ఆ శాఖకు మంత్రి ఎందుకు?, టూరిజమ్ కార్పొరేషన్‌కు ఛైర్మన్ అవసరమా? అని సూటిగా రామకృష్ణ ప్రశ్నించారు. పర్యాటకరంగం ప్రైవేటీకరణ వల్ల సామాన్య ప్రజలకు టూరిజం అందుబాటులో లేకుండా పోతుందన్నారు. ప్రధానంగా 25 ఏళ్ల నుంచి ఇదే శాఖను నమ్ముకుని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందన్నారు. మొత్తం విద్యా, వైద్య రంగాలను ప్రైవేట్‌కు అప్పజెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకరంగాన్ని సైతం ప్రైవేట్‌కు అప్పగిస్తే ఇక మీ ప్రభుత్వం ఎందుకు?, ఆయా శాఖల మంత్రులు ఎందుకు? ఉన్నారని ప్రశ్నించారు. 33 ఏళ్లు, 90 ఏళ్లపాటు లీజుకు ఇష్టానుసారంగా ఇస్తే.. అప్పటికి ఎవరుంటారని నిలదీశారు. పర్యాటక రంగ హోటళ్లను 33 ఏళ్లకు లీజుకిచ్చే విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 18వ తేదీన పర్యాటకరంగ సంస్థ ఉద్యోగులు, అన్ని కార్మిక సంఘాలతో కలిపి ఇచ్చిన చలో అసెంబ్లీ పిలుపును జయప్రదం చేయాలని కోరారు. గతంలో పర్యాటక రంగానికి ఛైర్మన్లుగా పనిచేసిన వారు, అధికారులు సైతం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబుకు పక్కా ప్రైవేటీకరణ జబ్బు పట్టుకుందని దుయ్యబట్టారు. అది ఒక్క పర్యాటక రంగమే కాదు..అన్ని విభాగాలనూ చేసేందుకు ముందుకు పోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటకు కట్టబెడుతూ..వారినే కోటేశ్వర్లుగా మోదీ, చంద్రబాబు చేస్తారని, ఆ తర్వాత వారిని మార్గదర్శకులుగా పోల్చుతూ సాయం చేయమని కోరడం తగదన్నారు.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, కార్మికులు, ప్రజలు, ఉద్యోగులు కష్టపడి సృష్టించిన ప్రభుత్వ సంపదను ప్రైవేటుకు ధారాదత్తం చేసే నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, పర్యాటకరంగ హోటళ్ల ప్రైవేటీకరణ నిర్ణయం తగదని, దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఒక క్రమపద్ధతిలో విజయం సాధించే దిశగా రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని సూచించారు. ప్రస్తుత పర్యాటకరంగం ఆధ్వర్వంలో నడుస్తున్న హరితా హోటళ్లు, రిసార్టులు మంచి సేవలందిస్తున్నాయని, అక్కడక్కడా పనులు జరగలేదంటే అది ప్రభుత్వాలు నిధులు జమ చేయకపోవడమేనని స్పష్టం చేశారు. సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న పర్యాటక రంగ హోటళ్ల ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని, తక్షణమే దాన్ని విరమించాలన్నారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలోని వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగించి పేదలకు విద్యను దూరం చేసిందని, అలాగే పర్యాటక రంగ హోటళ్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసే ఉద్యమాలకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. సీపీఎం రాష్ట్ర నాయకులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ నాడు పర్యాటకరంగ పాలసీని గొప్పగా చెప్పిన చంద్రబాబు..ఇప్పుడు వాటిని ప్రైవేట్ పరం చేస్తూ..ఉద్యోగులను నడిరోడ్డుకు ఈడుస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమాలకు సంపూర్ణ మద్దతిస్తామన్నారు.
ఏపీటీడీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.రామకృష్ణ, పీటీ ప్రసాద్ మాట్లాడుతూ, పర్యాటక రంగం ప్రైవేటీకరణ అయితే ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకులు పోలారి, ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ వెంకట సుబ్బయ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు కె.రవీంద్ర మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్ని వరుస వారీగా నిర్వీర్యం చేసే కుట్రకు తెరదీసిందని, ఇప్పుడు పర్యాటకరంగం వంతు వచ్చిందనీ, ప్రభుత్వం దిగివచ్చేంతవరకు పోరాటాలు చేస్తామన్నారు. పర్యాటకరంగ ఉద్యోగులు కొందరు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించారు. ఏఐటీయూసీ విజయవాడ నగర అధ్యక్షులు కెఆర్.ఆంజనేయులు, వివిధ ప్రజా సంఘాల నేతలు, పర్యాటక రంగ ఉద్యోగులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News