-జిల్లా అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశం
-విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం లేకండా చూడాలి
-పరిస్థితి అంచనా వేసి తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి
-తుఫాన్ ప్రభావం ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచన
మన్యం జిల్లా పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా తుఫాన్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో, ఇతర శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని, ఈ సమయంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ-ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు తుఫాన్ ప్రభావంపై సమాచారం వేగంగా చేరవేసి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తీర ప్రాంతాలకు చేరుకొని జిల్లాల్లోని తుఫాన్ ప్రభావాన్ని పర్యవేక్షణ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించి అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతీ శాఖ, ప్రతీ విభాగం సమన్వయంతో పనిచేయాలని అధికారులను నిర్దేశించారు. చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతులు చేసేలా సిద్ధంగా ఉండాలన్నారు. చెట్లు కూలిపోయినా, కొమ్మలు విరిగిపడినా వాటిని తొలగించడానికి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, నీటి సరఫరా విభాగం అధికారులు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
Prajavartha Online Telugu News