– ఆటో అప్రూవల్ (14ఏ) దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలి
– 90 శాతం రిటర్న్ ఫైలింగ్ ను 100 శాతానికి చేర్చాలి
– రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యాపారస్తులపట్ల స్నేహ భావంతో వ్యవహరిస్తూ రాష్ట్రంలో పన్నుల రాబడిని పెంచి రాష్ట్ర పురోభివృద్ధికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనాఉందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తాడేపల్లిలోని వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం రేంజ్ ఆఫీసర్లు (ఆర్వోలు), జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో మంత్రి పయ్యావుల కేశవ్ రెవెన్యూ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక మరియు వాణిజ్య పన్నులు శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన సంస్కరణలు రాజకీయంగా సరైనవే కాక ప్రజలకు, వ్యాపారులకు అనుకూలమైనవని తెలిపారు. డిసెంబర్ నాటికి నిర్దేశించుకున్న వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్యాలను పూర్తి చేయాలని గుర్తుచేశారు. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పన్ను వసూళ్ల వృద్ధి రేటు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర పాలన సజావుగా సాగేందుకు రాబోయే మూడు నెలల్లో అవసరమైన నిధుల సమీకరణలో వాణిజ్య పన్నుల శాఖ పాత్ర కీలకమని మంత్రి స్పష్టం చేశారు. సంస్కరణల పేరుతో అధికారులు బాధ్యతల నుంచి రిలాక్స్ కావద్దని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పరిస్థితిని గమనిస్తున్నారని తెలిపారు. ఎక్సైజ్ శాఖ పనితీరును స్ఫూర్తిగా తీసుకుని, వాణిజ్య పన్నుల శాఖ కూడా పన్ను పరిధి (Tax Base) పెంచి లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. ట్యాక్స్ బేస్ పరంగా చూస్తే వృద్ధి చాలా స్వల్పంగా ఉందని, పన్ను సంస్కరణలకన్నా అధికారుల పనితీరు, సామర్థ్యమే ట్యాక్స్ బేస్ పెరుగుదలకు కీలకమని అన్నారు. పొరుగు రాష్ట్రాలతో వాణిజ్య పన్నుల శాఖ పనితీరును పోల్చి విశ్లేషించాలని సూచించారు. ఆటో అప్రూవల్ (14A) సౌకర్యాన్ని తప్పుడు మార్గాల్లో ఎవరైనా ఉపయోగిస్తున్నారా అనే విషయాన్ని నిశితంగా అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. ప్రస్తుతం 90 శాతం రిటర్న్ ఫైలింగ్ జరుగుతోందని, అధికారుల కృషితో దీన్ని 100 శాతానికి తీసుకెళ్లేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. నిర్దేశిత గడువు లోగా ఆడిట్ కేసులకు పరిష్కారం చూపాలని, క్షేత్రస్థాయి అధికారులు అంకితభావంతో పనిచేసి పన్ను ఎగవేతను అరికట్టాలని మంత్రి స్పష్టం చేశారు. నివేదికల ఆధారంగా పనిచేస్తూనే, డీలర్ల పట్ల సానుకూల దృక్పథంతో, మానవీయ కోణంలో (Human Touch) వ్యవహరించాలని మంత్రి సూచించారు. పనితీరును మెరుగుపరుచుకునేందుకు ప్రతి అధికారి డైలీ లేదా వీక్లీ డైరీ నిర్వహించాలని సూచించారు. శాఖలో కొత్త పోస్టుల సృష్టి ద్వారా పదోన్నతులు లభిస్తాయని, ఇది శాఖ చరిత్రలోనే ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. పని ఒత్తిడి పేరుతో బాధ్యతల నుంచి తప్పుకోవడం సరికాదని, తమ పనిని ఆస్వాదించని వారే ఒత్తిడిని సాకుగా చూపుతారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కష్టపడి పనిచేస్తూ ప్రభుత్వ ఇమేజ్ పెంచుతున్న సమయంలో, వాణిజ్య పన్నుల శాఖ కూడా ఆయనకు అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో, ముఖ్యంగా ఈ త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలు సాధించి పాత రికార్డులను తిరగరాయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారులు అవార్డులు, మెడల్స్ అందుకుంటే తాను ఎంతో సంతోషిస్తానని మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేశారు. ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి పియూష్ కుమార్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సు ద్వారా గూగుల్ సంస్థ వంటి పెద్ద సంస్థల నుంచి పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యంలో భాగంగా రాబోయే ఐదేళ్లలో రూ. 40 లక్షల కోట్ల పెట్టుబడులను ఆశిస్తున్నామని, పరిశ్రమల రంగంలో ఇప్పటికే రూ. 16 లక్షల కోట్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 29 శాతానికి పైగా రెవెన్యూ వృద్ధి సాధించడమే లక్ష్యమని తెలిపారు. జీఎస్టీ–2.0 (GST 2.0) ద్వారా సాంకేతికతను వినియోగించి రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఐటి (IT) ద్వారా పన్ను వసూళ్లు, డేటా విశ్లేషణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. వ్యాపారులకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ స్మార్ట్ గా పని చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ బాబు. ఎ మాట్లాడుతూ.. జీఎస్టీ 2.0 విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు చేపట్టిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాల ద్వారా పన్ను చెల్లింపుదారుల సందేహాలను నివృత్తి చేయడంలో రాష్ట్రం ముందుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ జనరేషన్ పోర్టల్స్ వంటి ఆధునిక సాంకేతికతతో పన్ను ఎగవేతలను అరికడుతున్నామని, పారదర్శకత పెరిగి అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ-వే బిల్లుల సంఖ్యలో గతేడాదితో పోలిస్తే 9.5 లక్షల పెరుగుదల ఉండటం రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు పుంజుకుంటున్నాయనేందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మార్చి నాటికి ఆదాయ వృద్ధిని 10 శాతానికి తీసుకెళ్లాలని అధికారులకు ప్రధాన కమిషనర్ బాబు. ఎ సూచించారు. వర్క్ షాపులో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ (లీగల్) డి. రమేష్, సెక్రటరీ టూ సిసిఎస్టి రవిశంకర్, స్పెషల్ కమిషనర్ అఫ్ స్టేట్ టాక్సెస్ ఎన్. సౌమ్య పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News