తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ శనివారం తిరుపతిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 52 వినతులను స్వీకరించారు.
ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన వినతులు అందాయి. వాటిలో కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగానికి 11, రెవెన్యూ శాఖకు 13, జిల్లా కలెక్టర్‌కు 1, కార్పొరేషన్ ప్రణాళిక విభాగానికి 1, తిరుమల తిరుపతి దేవస్థానానికి 2, కార్పొరేషన్ కమిషనర్‌కు 11, కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్‌కు 2, కార్పొరేషన్ సహాయ కమిషనర్‌కు 8, పోలీసు శాఖకు 3, స్కిల్ డెవలప్మెంట్ విభాగానికి 2 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనవాణి కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు ప్రజల సమస్యలను గుర్తించి జనవాణి ద్వారా పరిష్కారానికి సహకరించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, ఆర్వో రవి, డిప్యూటీ తాసిల్దార్ రామచంద్రయ్య, విద్యుత్ శాఖ ఏడి ఆంజనేయులు, ఏఈ ఉమాపతి, జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News