అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతికి ప్రధాన అనుసంధాన రహదారి అయిన సీడ్‌యాక్సిస్ రోడ్డుపై సెంట్రల్ మీడియాన్‌లో లెగస్ట్రోమియా పూలు విరగబూస్తున్నాయి. ఏకంగా 50 సెంటీ మీటర్ల పొడవుతో ఉండే ఈ పూలు క్వీన్‌స్పిసియోజా జాతికి చెందినవి. ఏప్రిల్, మే మాసాలలో గుత్తులు గుత్తులుగా పూసి ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకోవటం లెగస్ట్రోమియా పూల నైజం. వంగపండు, గులాబీ, లేత గులాబీ ఇలా మూడు రంగుల్లో పూస్తున్నాయి. సహజంగా వీచే గాలులకు లెగస్ట్రోమియా పూల గుత్తులు గంతులు వేసినట్లు ఆహ్లాదపరుస్తుంటాయి. 2018వ సంవత్సరంలో ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారథి వారు సీడ్‌యాక్సెస్‌రోడ్డుపై హార్టికల్చర్ అధికారులతో లెగస్ట్రోమియా పూల చెట్లను నాటించారు. ఎనిమిది సంవత్సరాలు కలిగిన ఈ పూల చెట్లకు విరివిగా నైట్రోజన్, పాస్పరస్, పొటాషియం ఎరువులను మరియు ఘనజీవామ్రుతాన్ని సిబ్బంది అందిస్తున్నారు. ఈ రహదారిపై 4 కి.మి మేర 8 వేల మొక్కలు ఉన్నాయి. అయిదు అడుగుల వరకు పెరిగే ఈ మొక్కల జీవిత కాలం 15 సంవత్సరాలు. పోషణ బలాన్ని బట్టి మరో 5 సంవత్సరాలు జీవించొచ్చని నిపుణుల అంచనా. మొక్కలకు నల్ల పేను బంక వంటి చీడపీడలు సోకకుండా, తెల్ల దోమల బారిన పడకుండా ప్రతిరోజూ ప్రత్యేక నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి మొక్కల తల భాగం నుంచి కాండం వరకు వాటరింగ్ చేస్తున్నారు. మూడు నాలుగు లెగస్ట్రోమియా పూల గుత్తులను కలిపితే సహజ సిద్ధమైన పుష్పగుచ్ఛంగా తయారవుతుంది. ఇవి వేసవితో పాటు అగస్టు, సెప్టెంబరు నెలలో కూడా రెండో దశ పూస్తాయి. అయితే కొన్ని చెట్లు ఏడాది పొడవునా పూస్తున్నాయి.
లెగస్ట్రోమియా పూర్తిగా ఔషధ గుణాలు కలిగిన మొక్క:
లెగస్ట్రోమియా పువ్వులు, ఆకులలో యాంటి ఆక్సిడెంట్లు, యాంటి ఇన్‌ప్లేటరీలు అధికంగా ఉండే వీటిని ఫిలిప్పియన్లు వీటి ఆకుల నుంచి టీ తయారు చేసుకుంటారు. అంతేకాదు టైప్-2 డయాబెటిక్ ఔషధాల తయారీలో వినియోగిస్తారు. రక్తపోటు నివారణ, గాల్‌బ్లాడర్, కిడ్నీలో రాళ్ల నివారణ, బ్లాడర్ డిస్‌ఫంక్షనింగ్ వంటి వ్యాధుల నివారణ మందుల్లో వినియోగిస్తారు.
Prajavartha Online Telugu News