– విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవిఎస్ సూర్యనారాయణ రాజు పిలుపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పరీక్షల సమయంలో విద్యార్థుల్లో కలిగే ఒత్తిడిని దూరం చేసి, వారిలో సానుకూల దృక్పథాన్ని నింపడమే లక్ష్యంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) నిర్వహిస్తున్న “పరీక్షా పర్వ్ 8.0” వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి “పరీక్షా పే చర్చ” స్ఫూర్తితో ఏటా నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా పరీక్షలను భయంగా కాకుండా ఒక పండుగలా జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన ఈ క్రింది అంశాలను వెల్లడించారు:
ముఖ్య కార్యక్రమాలు:
నిపుణులతో లైవ్ సెషన్లు: ఏప్రిల్ 23 నుండి ప్రముఖ మనస్తత్వవేత్తలు, నిపుణులతో NCPCR సోషల్ మీడియా మరియు దూరదర్శన్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతాయి. విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
నినాదాల పోటీ (Slogan Competition): “పరీక్షలను వేడుకగా జరుపుకోవడం” అనే అంశంపై విద్యార్థులు మే 23లోపు తమ నినాదాలను కమిషన్ వెబ్‌సైట్ (https://ncpcr.gov.in/parikshaparv) లో నమోదు చేయాలి.
ఆన్‌లైన్ క్విజ్: విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్‌లైన్ క్విజ్ https://quiz.mygov.in లో అందుబాటులో ఉంటుంది. పాల్గొన్న ప్రతి విద్యార్థికి ఇ-సర్టిఫికేట్ అందజేయబడుతుంది.
అవగాహన సదస్సులు: రాష్ట్రంలోని ఎంపిక చేసిన బ్లాకులలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
”పరీక్షలు అనేవి కేవలం ఒక దశ మాత్రమే, జీవితం కాదు. పిల్లలు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు వారికి అండగా నిలవాలి. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఈ వేదికను ఉపయోగించుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కోవాలి” అని చైర్మన్ సూర్యనారాయణ రాజు గారు ఆకాంక్షించారు.
మరిన్ని వివరాలకు మరియు రిజిస్ట్రేషన్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించాలని ఆయన సూచించారు.
Prajavartha Online Telugu News