Breaking News

నిరంతరాయ, నాణ్య‌మైన విద్యుత్ సరఫరాతోనే పారిశ్రామిక అభివృద్ధి

-పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది
-దేశంలోనే తొలిసారి ట్రూ డౌన్ చేశాం, ఇక ట్రూ అప్ అనే మాటే ఉండదు
-విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గించిన తరువాతే సాధారణ ఎన్నికలకు వెళ్తాం
-శ్రీసిటీ పారిశ్రామిక‌వేత్త‌ల‌తో ఇష్టాగోష్టిలో మంత్రి గొట్టిపాటి
-రాచెర్ల‌, తూకివాకంల‌లో స‌బ్ స్టేష‌న్ల ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి
-రాయ‌ల‌సీమ జిల్లాల్లో త్వ‌ర‌లో రూ.250 కోట్ల‌తో 65 స‌బ్ స్టేష‌న్లు
-ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

స‌త్య‌వేడు/శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
నాణ్య‌మైన, నిరంతరాయ విద్యుత్ స‌ర‌ఫ‌రా తోనే పారిశ్రామికాభివృద్ధి సాధ్య‌మ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. దీనికి అనుగుణంగానే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రోత్స‌హించ‌డంతో పాటు వాటికి అవ‌స‌ర‌మైన స‌రిప‌డా విద్యుత్ ను అందిస్తోందని తెలిపారు. ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బుధ‌వారం నాడు ముందుగా స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గంలోని రాచెర్ల‌, శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తూకివాకంలో స‌బ్ స్టేష‌న్ల‌ను ప్రారంభించారు. శ్రీసిటీలో పారిశ్రామికవేత్త‌ల‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తూ, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాచెర్ల స‌బ్ స్టేష‌న్ తో శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతానికి ఇక‌పై లో ఓల్టేజ్ స‌మ‌స్య‌లు, విద్యుత్ అంత‌రాయాలు ఉండ‌వ‌ని స్పష్టం చేశారు. శ్రీసిటీలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలకు అన్ని విధాలా కూట‌మి ప్రభుత్వ మద్దతు ఉంటుంద‌ని చెప్పారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలో దేశంలోనే ప్రసిద్ధ పారిశ్రామిక హబ్‌గా శ్రీసిటీ అభివృద్ధి చెందుతుండటం పట్ల ఆయ‌న‌ హర్షం వ్యక్తం చేశారు.

31 దేశాల పారిశ్రామిక‌వేత్త‌ల‌ పెట్టుబ‌డులు….

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపించడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారని ఇంధ‌న మంత్రి గొట్టిపాటి తెలిపారు. గత రెండేళ్లలో శ్రీసిటీలో వచ్చిన కొత్త పరిశ్రమలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం 31 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టారని, తద్వారా 70 వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు. రానున్న రోజుల్లో శ్రీసిటీ ద్వారా సుమారు 1.50 లక్షల మందికి ప్ర‌త్య‌క్షంగానే ఉపాధి ల‌భిస్తుంద‌ని మంత్రి వెల్ల‌డించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ప్రభుత్వం విద్యుత్ రాయితీలను ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో దేశంలోనే తొలిసారిగా విద్యుత్ చార్జీలను ‘ట్రూ డౌన్’ చేశామని గుర్తుచేశారు. ట్రూ అప్ అనేది లేకుండా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందే విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గిస్తామ‌న్నారు. ఛార్జీల‌ను త‌గ్గించే తాము ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌న్నారు. విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి మద్దతు కావాలన్నా అందిస్తామని ఈ సంద‌ర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. శ్రీసిటీకి కొత్త సబ్ స్టేషన్ కేటాయించడంపై పారిశ్రామికవేత్తలు మంత్రి గొట్టిపాటికి కృతజ్ఞతలు తెలిపారు.

రూ.165 కోట్ల‌తో రాచెర్లలో 220\132 సబ్ స్టేషన్….

సత్యవేడు నియోజకవర్గంలోని రాచెర్లలో రూ. 165 కోట్లతో నిర్మించిన 220/132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. 2019లోనే ఈ సబ్ స్టేషన్ ను ప్రారంభించినా… గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆలస్యమైందని ఆయన విమర్శించారు. ఈ సబ్ స్టేషన్ అందుబాటులోకి రావడంతో శ్రీసిటీ, రాచెర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోని పారిశ్రామిక, వ్యాపార, గృహ వినియోగదారులకు లో-ఓల్టేజ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా అందుతుందని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం, రేణిగుంట మండ‌లంలోని తూకివాకంలో రూ.76.89 కోట్ల‌తో నిర్మించిన 132\33 కేవీ విద్యుత్ స‌బ్ స్టేష‌న్ ను కూడా మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. లో ఓల్టేజ్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ఎస్పీడీసీఎల్ పరిధిలో త్వరలోనే 33\11 కేవీ సామ‌ర్థ్యం క‌లిగిన‌ 65 సబ్ స్టేషన్లను సుమారు రూ.250 కోట్ల‌తో నిర్మించ‌డానికి టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా లో-ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ అందించడానికి రూ. 6 వేల కోట్లతో కొత్త సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి ఈ సంద‌ర్భంగా తెలిపారు.

పున‌రుత్పాద‌క విద్యుత్…. ఉచిత సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు….

పీఎం సూర్యఘర్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 1.30 లక్షల విలువైన 2 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చుతో పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. అలాగే 3 కిలోవాట్ల యూనిట్ కు ఓసీలకు రూ. 78 వేలు సబ్సిడీ ఇస్తుండగా, బీసీలకు అదనంగా మరో రూ. 20 వేలు కలిపి మొత్తంగా రూ. 98 వేల సబ్సిడీ అందిస్తున్నామన్నారు. త‌ద్వారా పున‌రుత్పాద‌క విద్యుత్ ను ప్రోత్స‌హిస్తున్నామ‌న్నారు. బీసీ వినియోగదారులకు సంబంధించిన పీఎం సూర్య‌ఘ‌ర్ టెండర్ల ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని స్పష్టం చేశారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు పగటి పూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, పనులు త్వరలో ప్రారంభం అవుతాయని వివరించారు.

శ్రీసిటీకి నిరంతరాయ విద్యుత్ సరఫరా

శ్రీసిటీ పరిధిలో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నామని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి వెల్లడించారు. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో రాష్ట్ర ఇంధన శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం స్థానిక పారిశ్రామిక వినియోగదారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరాపై పారిశ్రామికవేత్తలు వ్యక్తపరచిన అంశాలపై సీఎండి మాట్లాడుతూ శ్రీసిటీకి అంతరాయం లేని విద్యుత్తును సరఫరా చేయడమే ధ్యేయంగా చర్యలు చేపడుతున్నామని వివరించారు. స్థానికంగా ఎదురయ్యే విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు వీలుగా ఏపీట్రాన్స్కో, ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి నెలా మొదటి బుధవారం ఏపీట్రాన్స్కో, ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు, శ్రీసిటి పారిశ్రామిక వినియోగదారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. శ్రీసిటీలోని వివిధ కంపెనీల ప్రతినిధులు కూడా అంతర్గతంగా ఏర్పాటు చేసుకునే విద్యుత్ పరికరాలు నాణ్యతను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ఇక శ్రీసిటీలో విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే సమస్యలను అధ్యయనం చేసి, విద్యుత్ సరఫరాలో నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా శ్రీసిటీలో నూతనంగా మరో సబ్-స్టేషన్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా మరింత మెరుగైన విద్యుత్ సరఫరాకు అవసరమైన స్విచ్చింగ్ స్టేషన్ లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బొజ్జ‌ల వెంక‌ట సుధీర్ రెడ్డి, సత్యవేడు టీడీపీ ఇంచార్జ్ కూరపాటి శంకర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఇంజనీర్లు, అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *