– ఎస్.హెచ్.జి (SHG) సభ్యులందరికీ బీమా భరోసా – సెర్ప్ కీలక నిర్ణయాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2026 – 27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేయాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పని చేయాలని
రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం విజయవాడలోని సెర్ప్ రాష్ట్ర కార్యాలయంలో సెర్ప్ కార్యక్రమాల అమలుపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామస్థాయిలో ఈనారిలు, వీవోఏల ద్వారా ప్రతి సంఘ సభ్యురాలు చేపట్టబోయే జీవనోపాధి కార్యక్రమ వివరాలు, దానికి అవసరమైన పెట్టుబడి వివరాలు సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వారికి చేయూత ఇచ్చేలా ప్రణాళిక రచించాలని మంత్రి సూచించారు. ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడిని బ్యాంకులు స్త్రీనిధి, ఉన్నతి, సీఐఎఫ్ మరియు పీఎఫ్ఎంఈ, పీఎంఈజీపీ ద్వారా సమకూర్చేలా వార్షిక రుణ మరియు పెట్టుబడి ప్రణాళిక తయారు చేయాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP), స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులు , వారి కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ‘ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన’ (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన’ (PMSBY) మరింత వేగంగా అమలు చేయాలని ప్రస్తుతం గ్రామ సంఘాల సహాయకులు (VOAs) నమోదు చేస్తున్న డేటాలో స్పష్టత పెంచేందుకు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) నుంచి అధికారిక సమాచారాన్ని సేకరించి సెర్ప్ పోర్టల్‌తో అనుసంధానం చేయాలని మంత్రి సూచించారు. ఈ ప్రక్రియలో బీమా గురించి పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయన్నారు. సభ్యులు మృతిచెందినప్పుడు అవగాహన లేక కుటుంబాలు క్లెయిమ్ పొందలేకపోతున్నాయన్నారు. ఇకపై ఎవరైనా సభ్యులు మృతిచెందితే గ్రామసంఘం ప్రతినిధులు, VOA వెంటనే ఆ ఇంటిని సందర్శించి బ్యాంకులో క్లైయిమ్ దరఖాస్తు చేసి ఆ కుటుంబానికి సాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీమా ప్రయోజనాలు లబ్ధిదారులకు సకాలంలో అందేలా సెర్ప్ ప్రత్యేక ప్రామాణిక విధానం (SoP) రూపొందించి క్లెయిమ్ పోజిషన్ పర్యవేక్షించాలని మంత్రి తెలిపారు. ఈ పద్ధతిలో ప్రతి పేద కుటుంబానికి బీమా రక్షణ కల్పించడంతో పాటు ఆపదలో వారికి ఆర్థికంగా అండగా నిలవాలని మంత్రి సూచించారు. ఎన్‌పిఎస్ లైట్ – స్వావలంబన్ (NPS Lite – Swavalamban) పథకంలో సభ్యులుగా ఉండి, 60 ఏళ్లు నిండిన చందాదారులకు పెన్షన్ నిధుల రీఫండ్ వేగంగా ఇచ్చేలా చూడాలని మంత్రి సెర్ప్ ( SERP ) అధికారులకు సూచించారు. గత సంవత్సరం లక్ష్యాలు సాధించి సెర్ప్ సిబ్బందిని మంత్రి అభినందించారు. వార్షిక రుణ మరియు పెట్టుబడి ప్రణాళిక పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో సెర్ప్ సెక్రటరీ & సీఈవో వాకాటి అరుణ, అడిషనల్ సీఈవో శ్రీరాములు నాయుడు, స్త్రీ నిధి ఎండి హరిప్రసాద్, ఇతర డైరెక్టర్లు, అడిషనల్ డీపీఎంలు, స్త్రీ నిధి డీజీఎంలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News