-అనంతబాబును తక్షణమే అరెస్ట్ చేసి, సాక్షులకు రక్షణ కల్పించాలని డిమాండ్
-రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు దళిత సంఘాల నిరసన జ్వాలలు
-రెండు రోజుల్లో అనంతబాబు లొంగిపోకపోతే నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిక
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంపై రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు, దళిత నాయకులు, రాజకీయ పార్టీలు భారీ ఎత్తున నిరసనలకు దిగాయి. సాక్షులను బెదిరించడం, డబ్బు ఆశ చూపించి కేసును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన అనంతబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంనతబాబుపై ఎందుకంత ప్రేమ జగన్?
రంపచోడవరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గానికి చెందిన దళిత నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నిందితుడు అనంతబాబును వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు నినదించారు. అటు అనపర్తి కెనాల్ రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా దళిత సంఘాలు భారీగా మోహరించి ఆందోళన నిర్వహించాయి. హంతకుల పట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఎందుకు అంత ప్రేమో అర్థం కావడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు ఒక చట్టం, అధికార పార్టీ నాయకులకు మరొక చట్టమా అని వారు ప్రశ్నిస్తూ నిరసనను ఉధృతం చేశారు.
దళితులంటే జగన్‌కు పట్టదా?
కాకినాడ రూరల్‌లోని కురూపం మండలంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల నాయకులు ఐక్యంగా తరలివచ్చి నిందితుడిని వెంటనే కటకటాల వెనక్కి నెట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనలు జరిపారు. గోపాలపురం నియోజకవర్గం వెల్లచింతలగూడెం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ప్రతినిధులు శాంతియుతంగా తమ నిరసనను తెలియజేశారు. కాకినాడ రూరల్ పరిధిలోని ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద భారీ ర్యాలీ నిర్వహించి, సాక్షులను భయబ్రాంతులకు గురిచేస్తున్న అనంతబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే విచారణను వేగవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. దళిత బిడ్డ హత్యకు గురైతే జగన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తుని రహదారి దిగ్భందించి నిరసన
తుని నియోజకవర్గం సాలూరు పట్టణంలోని కొండవారి పేటలో దళిత సంఘాలు భారీ ధర్నా నిర్వహించి రహదారిని దిగ్బంధం చేశాయి. నిందితుడు బెయిల్‌పై బయట తిరుగుతూ సాక్షులను ప్రభావితం చేస్తున్నాడని వారు ఆరోపించారు. మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సాలూరు టౌన్లో కూడా ఎస్సీ, ఎస్టీ నాయకులు కలిసి నిరసన జరిపి, ఎమ్మెల్సీ అరెస్టుకు డిమాండ్ చేశారు.
పి.గన్నవరంలో భారీ ఎత్తున దళిత నాయకుల ర్యాలీ
పి.గన్నవరం నియోజకవర్గం కొత్తపేటలో రామారావుపేట నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సుమారు 250 మందికి పైగా కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని తక్షణమే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించి, సామాన్య పౌరునిలా విచారించాలని వారు డిమాండ్ చేశారు. పి. గన్నవరం సెంటర్లో ఆందోళన చేపట్టిన నిరసనకారులు, నిందితుడి బెయిల్ రద్దు చేసి వెంటనే జైలుకు పంపాలని కోరారు. రాజోలులో దళిత సంఘాలు ఏకమై నిరసనలు చేపట్టి, బాధితులకు అండగా ఉంటామని ప్రకటించాయి.
కొవ్వూరులో ట్రాఫిక్‌ను స్తంభింపజేసిన దళిత నాయకులు
కొవ్వూరు నియోజకవర్గం ప్రత్తిపాడులో మహాసేన రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో రెండు రోజుల గడువు విధిస్తూ అల్టిమేటం జారీ చేశారు. ముమ్మిడివరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన అనంతరం భారీ ప్రదర్శనగా వెళ్లి స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కొవ్వూరు వాటర్ ట్యాంక్ సెంటర్ వద్ద నిరసనకారులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కాకినాడ పట్టణంలోని కాస్మోపాలిటన్ క్లబ్లో టీడీపీ నాయకుడు రాజేష్ మహాసేన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ అనంతబాబును కేవలం రెండు రోజుల్లోనే చట్టానికి అప్పగించకపోతే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జగన్ రెడ్డి నేరస్తులను కాపాడుతున్నారని, జగన్ అండతోనే నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. దళితుల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ సమావేశం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది.
అనంతబాబును ఉరి తీయాలంటూ అమలాపురంలో నిరసనలు
అమలాపురం పార్క్ రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో సిట్ విచారణ అంశాలను ప్రస్తావించారు. సుబ్రహ్మణ్యం మృతదేహంపై 31 గాయాలు ఉన్నాయని సిట్ నివేదికలో తేలిందని, ఇది ఘోరమైన హత్యని వారు మండిపడ్డారు. రామచంద్రపురం మెయిన్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టి నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. మండపేటలో కూడా దళిత నాయకులు ఆందోళనలు నిర్వహించి, అనంతబాబు బెయిల్ తక్షణమే రద్దు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ ఉద్యమం న్యాయం జరిగే వరకు కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.
విజయవాడలో బహుజన జేఏసీ భారీ ర్యాలీ
విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద దళిత సంఘాలు, బహుజన జేఏసీ నాయకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన డ్రైవర్‌ను చంపి, ప్రమాదంగా చిత్రీకరించడం అత్యంత పాశవికమని వారు మండిపడ్డారు.
విశాఖలో దళిత సంఘాల నిరసనలు
విశాఖపట్నంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట దళిత విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించాయి. అనంతబాబు బెయిల్ రద్దు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు
తిరుపతిలో మౌన ప్రదర్శన
తిరుపతి: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దళిత సంఘాలు కళ్లకు గంతలు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వినూత్నంగా తెలిపారు. అనంతబాబును ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి.
మన్యంలో అనంతబాబుపై దళిత సంఘాలు ఆగ్రహజ్వాలలు
పార్వతీపురంలో కూడా దళిత సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో దళితులకు అడుగడుగునా అన్యాయం జరిగిందని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా హత్య చేసి “డోర్ డెలివరీ” చేసిన ఘటన దళిత సమాజం ఎప్పటికీ మరిచిపోదని పేర్కొన్నారు. అనంతబాబుకు జగన్ ఆశ్రయం ఇవ్వడం దళితుల పట్ల ఉన్న వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. గతంలో కూడా వైసీపీ పాలనలో దళితులపై అనేక అన్యాయాలు, దాడులు జరిగాయని గుర్తుచేశారు.
రాజమండ్రిలో అంబేద్కర్ వాదుల నిరసన
రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులు ధవలేశ్వరం గ్రామంలో సమావేశం నిర్వహించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో దళిత నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో దళితులపై దాడులు, హత్యలు జరిగి నిందితులు సులభంగా బెయిల్‌పై బయట తిరుగుతూ దళితులను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటు శక్తితో అలాంటి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పామని పేర్కొన్నారు. అయినప్పటికీ, అదే ధోరణి కొనసాగిస్తూ ఎమ్మెల్సీ అనంతబాబు మరో దళితుడిని కిరాతకంగా హత్య చేసి, ఇప్పుడు సాక్షులను బెదిరిస్తూ డబ్బు ఆశ చూపిస్తున్నాడని మండిపడ్డారు.
ఈ విధంగా జగ్గంపేట, సామర్లకోట తదితర ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద దళిత సంఘాలు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాయి. అల్లూరి సీతారాం జిల్లా అరకు, పాడేరు, కురుపాం, సాలూరు, రంపచోడవరం వంటి గిరిజన ప్రాంతాల్లో కూడా దళిత, గిరిజన నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జగ్గంపేటలో అంబేద్కర్ నగర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించి “దళిత ద్రోహి” అంటూ నినాదాలు చేశారు. అనపర్తి, గోపాలపురం, ప్రత్తిపాడు, రాజానగరం, దివాన్ చెరువు వంటి ప్రాంతాల్లో కూడా విస్తృతంగా నిరసనలు కొనసాగాయి. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని దళిత సంఘాలు స్పష్టం చేశాయి.
Prajavartha Online Telugu News