విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేజీబీవీ సిబ్బందికి మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని ఏపి సమగ్ర శిక్ష & కేజీబీవీ కాంట్రాక్ట్ ఒట్సోర్సింగ్ ఎంప్లాయిస్ పోరమ్ (జేఎసి) రాష్ట్ర అధ్యక్షలు ఎం.బాలకాశి, ప్రధాన కార్యదర్శి కె.విజయ్, ఎఐటియుసీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. రెగ్యులరైజేషన్ చర్యలు చేపట్టాకే బదిలీలు చేయాలని, బదిలీలపై కేజీబీవీ టీచింగ్ సిబ్బందిపై అధికారులు దుందుడుకు చర్యలు వెంటనే ఆపాలి. అనధికార బదిలీల వ్యవహారంపై విద్యాశాఖామంత్రి జోక్యం చేసుకోవాలని అక్రమ బదిలీ లను ఆపాలన్నారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 354 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) లో పనిచేస్తున్న సుమారు ఐదువేల మందికి పైగా టీచింగ్ సిబ్బంది సమస్యలపై ఎస్ఎస్ఎ కేజీబీవీ ఇఎఫ్ రాష్ట్ర కమిటీ, ఉద్యోగుల ఫోరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బదిలీలు పారదర్శకంగా, పాయింట్ల కేటాయింపు, అభ్యంతరాల స్వీకరణ ద్వారా జరిగేవని, కానీ ఇప్పుడు ఎటువంటి అధికారిక ప్రొసీడింగ్స్ లేకుండా కేవలం వాట్సాప్ సందేశాలు, ఫోన్ కాల్స్ ద్వారా బదిలీలకు ఆదేశాలు ఇవ్వడం “ఆటవిక రాజ్యాన్ని” తలపిస్తోందని విమర్శించారు. ఈ పద్ధతి ద్వారా రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. మినిమం టైమ్ స్కేల్, రెగ్యులరైజేషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పులను అధికారులు అమలు చేయకపోవడం అన్యాయమని వారు పేర్కొన్నారు. బదిలీల పేరుతో టీచింగ్ సిబ్బందిపై జరుగుతున్న ఒత్తిడిని, దుందుడుకు చర్యలను ఆపడానికి విద్యాశాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, ఉద్యోగులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రాజెక్ట్ అధికారులు తమ ఏకపక్ష ధోరణిని వీడకపోతే, సిబ్బంది ప్రయోజనాల కోసం రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామన్నారు.
Prajavartha Online Telugu News