-రోగాల ముందస్తు నివారణ లక్ష్యంగా ఒక్కొక్కరికి 47 రకాల పరీక్షలు
-ముఖ్యమంత్రి హామీ అమలు దిశగా నిర్ణయం
-సాలీనా రూ.163 కోట్ల వ్యయంతో 57 లక్షల మందికి సమగ్ర పరీక్షలు
-త్వరలో 104 సంచార వైద్య వాహనాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సేవలు
-పకడ్బందిగా వ్యక్తుల డిసీజ్ ప్రొఫైల్స్ రూపకల్పన
-పధకాన్ని ఆమోదించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రోగాల ముందస్తు నివారణ చర్యలకు ప్రాధాన్యతనిస్తూ వ్యక్తుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు సమగ్ర వైద్య పరీక్షలు చేపడతామని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు దిశగా వైద్యారోగ్య శాఖ ప్రధాన నిర్ణయాన్ని తీసుకుంది. 104 సంచార వైద్య వాహనాల (MMUs) ద్వారా సాలీనా రూ.162.72 కోట్ల వ్యయంతో గుర్తించిన ప్రతి వ్యక్తికీ 47 రకాల వైద్య పరీక్షలు చేపట్టే పధకానికి వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ బుధవారంనాడు ఆమోదం తెలిపారు. ఎన్సిడి సర్వేలో… వివిధ జబ్బులపాలైన లేదా అవకాశమున్న వారిగా గుర్తించిన వారితో పాటు సంక్షేమ విద్యా వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులతో కలిపి ఏడాదికి 56 లక్షల 40 వేల మందికి ఒక్కొక్కరికీ 47 రకాల పరీక్షలు చేస్తారు.
జబ్బులకు గురైన వారికి చికిత్స అందిస్తున్న ప్రస్తుత విధానానికి భిన్నంగా…పౌరుల ప్రస్తుత సమగ్ర ఆరోగ్య పరిస్థితిని వివిధ పరీక్షల ద్వారా మదింపు చేసి తద్వారా రోగాలను నివారించే దిశగా తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. ఈమేరకు విస్తృత చర్చలనంతరం 104 వాహనాల ద్వారా అమలుకానున్న పౌరుల ఆరోగ్య తనిఖీ(సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్) పధకానికి మంత్రి ఆమోదం తెలిపారు.
కొత్త పుంతలు తొక్కనున్న 104 సేవలు
ఇప్పటి వరకు 104 సంచార వైద్య వాహనాల ద్వారా గ్రామ స్థాయిలో 15 రోజులకోసారి 6 రకాల పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి. అవి…ర్యాండమ్ బ్లడ్ షుగర్, యూరిన్ షుగర్, హిమోగ్లోబిన్, మలేరియా వంటి వ్యాధుల నిర్ధారణకు ర్యాపిడ్ డయోగ్నాస్టిక్ టెస్ట్, యూరిన్ అల్బుమిన్ మరియు గర్భధారణ నిర్ధారణకు మూత్ర పరీక్ష. ఇవి కూడా ఎక్కువ భాగం అంతగా ఖచ్చితమైన ఫలితాలివ్వని ర్యాపిడ్ కిట్స్ ద్వారా జరుగుతున్నాయి. దీంతో పాటు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో వ్యక్తుల డిసీజ్ ప్రొఫైల్స్ మరియు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల తయారీ కావడంలేదు.
దీనికి భిన్నంగా నూతన 104 సేవల అమల్లో భాగంగా 11 అంశాలకు సంబంధించి గుర్తించిన ప్రతి వ్యక్తికీ మొత్తం 47 రకాల పరీక్షలు జరుగుతాయి. వీటి వివరాలు: కాలేయ సంబంధిత పరీక్షలు(ఎల్ఎఫ్టి)-8, మూత్ర విశ్లేషణ-6, కొవ్వు సంబంధిత పరీక్షలు(లిపిడ్ ప్రొఫైల్)-5, తెల్ల రక్త కణాల కౌంట్-5, ఎర్ర రక్త కణాల కౌంట్-5, ఎలక్ట్రొలైట్ పరీక్షలు-4, మూత్ర పిండాల పరీక్షలు(ఆర్ ఎఫ్‌టి)-3, గ్లూకోజ్ పరీక్షలు-3, కోయాగ్యులేషన్ పరీక్షలు(రక్తం గడ్డకట్టడానికి సంబంధించి)-2, ఇఎస్ఆర్( ఇన్ఫెక్షన్కు సంబంధించి)-1 తోపాటు 5 ఇతర పరీక్షలు.
ప్రయోజనం
ఈ సమగ్ర వైద్య పరీక్షల ఫలితాల ఆధారంగా పౌరుల ఆరోగ్య స్థితికి సంబంధించి వ్యక్తిగత స్థాయిలో డిసీజ్ ప్రొఫైల్స్ మరియు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను రూపొందించి సంజీవని పధకం కింద ఆయా వ్యక్తులకు ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మున్ముందు రోగాల నివారణకు చేపట్టాల్సిన విషయాలపై తగు సూచనలు అందించడం జరుగుతుంది. ఈమేరకు ఈ సమగ్ర వైద్య పరీక్షల ప్రారంభం రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా ఎంతో ప్రాముఖ్యమైన చర్య అని వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
సర్వీస్ ప్రొవైడర్ పాత్ర
మొదటి దశలో ఐదేళ్ల కాల పరిమితితో కూడిన ఈ పధకంలో భాగంగా…మొత్తం 904 వాహనాలతో 104 సంచార వైద్య సేవల్ని నిర్వహిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ ప్రతి వాహనంలోనూ సెమీ ఆటోమెటిక్ బయో కెమిస్ట్రీ ఎనలైజర్, సిబిసి మెషీన్ 3 పార్ట్ ఎనలైజర్, మైక్రోస్కోప్ మరియు ఇంక్యుబేటర్‌ను స్వంత ఖర్చుతో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు వివిధ పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే రిఏజెంట్లను ఇతర వస్తువులను కూడా సమకూర్చాలి. ప్రతి వాహనం రోజుకి 20 మంది చొప్పున నెలలో 26 పని దినాల్లో మొత్తం 520 మందికి 47 చొప్పున పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.
సత్వర ప్రారంభానికి మంత్రి ఆదేశం
విస్తృత ప్రయోజనాల లక్ష్యంగా రూపొందించిన ఈ పధకాన్ని అతి త్వరలో ప్రారంభించడానికి తగు చర్యలు చేపట్టాల్సిందిగా శాఖ ఉన్నతాధికారులను మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. రెండు నెలల్లో ఈ సేవల్ని ప్రారంభించడానికి కృషి చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు.
Prajavartha Online Telugu News