అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రేపు, ఎల్లుండి ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన అకాల వర్షాల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బుధవారం నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు గాను 16 జిల్లాల పరిధిలోని 88 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు.
గురువారం (30-04-26) అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, బొండపల్లి, రామభద్రాపురం మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా గరుగుబిల్లి, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం మండలాలు, అల్లూరి జిల్లా అనంతగిరి మండలాల్లో(10) తీవ్రవడగాల్పులు, మరో 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
ఇవాళ నెల్లూరు(జి) కొమ్మిపాడులో 44.1°C, అనకాపల్లి(జి) దేవరపల్లిలో 43.4°C, పల్నాడు(జి) బెల్లంకొండలో 43.3°C, మార్కాపురం(జి) నందనమారెళ్ళలో 43.2°C, చిత్తూరు(జి) గంగవరం 42.8°C, కర్నూలు(జి) నగరడోనలో 42.7°C, తిరుపతి(జి) దొరవారిసత్రంలో 42.5°C, ఎన్టీఆర్(జి) తొర్రగుడిపాడు 42.4°C, మన్యం(జి) మక్కువ, పోలవరం(జి) విఆర్ పురంలో 42.2°C, నంద్యాల(జి) చాగలమర్రి, ప్రకాశం(జి) కొప్పెరపాడు, వైఎస్సార్ కడప(జి) లింగాలలో 42.1°C, అనంతపురం(జి) రాయదుర్గంలో 42 చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.
మరోవైపు ద్రోణి ప్రభావంతో రేపు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News