Breaking News

ప్రతీ బూత్ పరిధిలో గతానికి మించి ఓట్లు రావాలి

-చేసిన అభివృద్ధి చెబుదాం… తెచ్చిన మార్పు చెబుదాం… పడిన కష్టం చెబుదాం
-లోకేష్… శభాష్
-పర్మిషన్లతో కాదు… పనితోనే పదవులు
-సీనియార్టీ… సిన్సియార్టీ… సోషల్ రీ-ఇంజనీరింగ్ తో కమిటీ కూర్పు
-అహం వద్దు… బేషజాలకు పోవద్దు
-2024కు ముందు జరిగిన ప్రతీ ఘటన గుర్తుంది… మనం చేసిన ప్రతీ పోరాటం గుర్తుంది
-గూగులే కాదు… స్వాతంత్ర్యం తెచ్చామని కూడా గొడ్డలి పార్టీ చెబుతుంది
-టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో సీఎం చంద్రబాబు
-కొత్త కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించిన చంద్రబాబు

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో గతానికి మించి కూటమి పార్టీలకు ఓట్లు రావాలని టీడీపీ కొత్త కార్యవర్గానికి, నేతలకు, కార్యకర్తలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. 2024లో వచ్చిన ఓట్లకంటే ఎక్కువ ఓట్లు రావాలని లీడర్లు, కేడర్ కు టార్గెట్ ఫిక్స్ చేశారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కొత్త కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. పాత-కొత్త కలయికతో టీడీపీ అధినాయకత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల, క్లస్టర్ స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చంద్రబాబు, లోకేష్ చోటు కల్పించారు. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని నిజం చేస్తూ పని చేసిన వారికే కమిటీల్లో పెద్ద పీట వేశారు. సీనియర్ల సారధ్యం… జూనియర్ల దూకుడును సమపాళ్లలో కలుపుతూ కమిటీల నియామకాన్ని చేపట్టారు. గతంలో సోషల్ మీడియాలో యాక్టీవుగా పనిచేసిన వారికి కమిటీలో చోటు కల్పించారు. ఎన్టీఆర్, చంద్రబాబు అధ్యక్షులుగా ఉన్నప్పుడు… లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంటుగా బాధ్యతలు స్వీకరిస్తున్న కమిటీల్లోనూ యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారు కీలక బాధ్యతలు చేపట్టారు. కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ హైలెట్ గా నిలిచారు. పార్టీలో కొత్తగా కొలువు తీరిన కార్యవర్గానికి.. నేతలకు, కేడర్ కు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడుతూ…”మరో 3 ఏళ్లలో మళ్లీ ఎన్నికలు వస్తాయని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేసేందుకే కూటమికి ప్రజలు ఓట్లేశారు. వచ్చే ఎన్నికల్లో 2024లో వచ్చిన ఓట్లకంటే ఎక్కువ ఓట్లు రావాలి… అప్పుడే బాగా పని చేసినట్టు. ఓటు బ్యాంక్ నిత్యం పెరుగుతూనే ఉండాలి. పార్టీ ప్రతిష్ట పెరిగేలా ప్రతి ఒక్కరూ పని చేయాలి. పార్టీ శాశ్వతంగా ఉండాలి.. తెలుగుదేశం బాగుంటే.. రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని.. ఇస్తోన్న సంక్షేమాన్ని… తెచ్చిన మార్పును… పడిన కష్టాన్ని ప్రజలకు చెబుదాం. ప్రతిదీ నిష్టతో.. మనస్సుతో.. భవిష్యత్తు కోసం పని చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలు వన్ సైడ్ గా ఉంటాయి.”అని చంద్రబాబు చెప్పారు.

తలవంచని… మీసం మేలేసే కేడర్ టీడీపీ సొంతం…

“ఎన్నో వడపోతలు, లెక్కలు, ఈక్వేషన్లతో కమిటీలను ఏర్పాటు చేశాం. సీనియర్లను గౌరవిస్తూ… కొత్తవారికి అవకాశాలు ఇస్తూ.. కష్టపడిన వారికి చోటిస్తూ కమిటీలను ఏర్పాటు చేశాం. తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడూ మీసం మేలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు. తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. కార్యకర్తే అధినేత అనేది నినాదంగా కాదు… విధానంగా మార్చుకున్నాం. మండల పార్టీ అధ్యక్షురాలికి.. క్లస్టర్ ఇన్ఛార్జికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించాం. మహిళలకు ఎక్కువగా అవకాశాలిచ్చాం. మహిళా బిల్లుకు పూర్తిగా మద్దతిచ్చాం. చదువుకున్న వారికి మంత్రి పదవులిచ్చి ప్రొత్సహించాం. రామ్మోహన్నాయుడు, శబరి, రాజేష్ వంటి వారిని జాతీయ ఉపాధ్యక్షులుగా చేసుకున్నాం. సినీయార్టీ, సిన్సియార్టీ, సోషల్ రీ-ఇంజనీరింగ్ వంటి కసరత్తు చేసి కమిటీ కూర్పు చేపట్టాం. ప్రతిపక్షంలో లోకేష్ చాలా కీలక పాత్ర పోషించారు. కేడర్ ను నిరంతరం మోటివేట్ చేశారు. అధికారంలోకి వచ్చాక.. పార్టీని గేరప్ చేశారు. ట్రైనింగ్ క్లాసులు మొదలుకుని… కార్యకర్తల సంక్షేమ బాధ్యతలను లోకేష్ సమర్థవంతంగా నిర్వహించారు. 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తామనే హామీని నెరవేర్చేందుకు లోకేష్ కృషి చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ఏపీకి వచ్చాయంటే కారణం లోకేషే. లోకేష్ సమర్థతను గుర్తించే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాం. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పదవి కాదు.. అత్యున్నత బాధ్యత. అప్పగించిన పదవిని బాధ్యతతో నిర్వహించాలి. 2024కు ముందున్న పరిస్థితులన్నీ అందరికీ తెలుసు. నాకు ప్రతి ఘటనా… ప్రతి ఒక్కరి పోరాటం నాకు గుర్తుంది. కార్యకర్తలు పడ్డ కష్టాలు నాకు గుర్తున్నాయి.”అని సీఎం చెప్పారు.

గాడిన పెడుతున్నాం… లక్ష్యాలను చేరుకుంటున్నాం

“వెంటిలేటర్ మీదున్న ఆర్థిక వ్యవస్థను కేంద్ర సాయంతో గట్టెక్కిస్తున్నాం. ఒక్కొక్కడుగు వేస్తున్నాం… వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం. నిలిచిన కేంద్ర పథకాలను పునరుద్దరించాం. అప్పులను రీ-షెడ్యూల్ చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాం. సంక్షేమం అందిస్తున్నాం. సుపరిపాలనతో వాట్సాప్ సేవలు అందిస్తున్నాం. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు పరుగులు పెట్టిస్తున్నాం. పోలవరం, అమరావతి పనులు చేపడుతున్నాం. స్టీల్ ప్లాంట్ ను రివైవ్ చేయగలుగుతున్నాం. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాం. రాష్ట్రానికి గత పాలనలో పోయిన బ్రాండ్.. నమ్మకాన్ని తిరిగి తీసుకురాగలిగాం. స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తున్నాం. విధ్వంసమైన విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించాం. ట్రూ అప్ ఛార్జీ భారం భరిస్తున్నాం. ట్రూ డౌన్ ఛార్జీల ద్వారా ప్రజలపై విద్యుత్ భారం తగ్గిస్తున్నాం. కరెంట్ ఛార్జీల పెంచకుండా పాలన చేపడుతున్నాం. విద్యుత్ కొనుగోళ్ల ధరలు తగ్గించేలా చర్యలు చేపడుతున్నాం. గతేడాది 30 పైసలు తగ్గించాం… మరో 30 పైసలు తగ్గించేలా ప్రణాళికలు రూపొందించాం. కరెంట్ ఛార్జీలు తగ్గించే ఆలోచనతో పని చేస్తున్నాం. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు పూర్తి చేసుకుంటున్నాం. విశాఖను టెక్ నగరంగా మారుస్తాం. రెవెన్యూ రికార్జులను ప్రక్షాళన చేస్తున్నాం. నిధుల లభ్యత తక్కువగా ఉన్నా… సమర్థ పాలనతో పనులన్నీ చేస్తున్నాం. తెలంగాణలో రాష్ట్రా ఆదాయంలో జీతాలకు 45 శాతం ఖర్చు పెడుతోంటే… మన రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 99 శాతం జీతాలకు ఖర్చు పెడుతున్నాం. అభివృద్ధి-సంక్షేమం ఆగకూడదని నిరంతరంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని.. ఎంతో కష్టపడి పని చేస్తున్నాం. ఠంచనుగా ఒకటో తేదీనే పెన్షన్లు ఇస్తున్నాం. దేశంలోని బెస్ట్ పాలసీలను అమలు చేస్తున్నాం.”అని సీఎం వివరించారు.

గొడ్డలి పార్టీకి CCD సోకింది

“మనం చేసిన మంచినే కాదు… ప్రత్యర్థుల కుట్రలను ప్రజలకు వివరించాలి. గొడ్డలి పార్టీ చేస్తున్న చెడును అనునిత్యం ప్రజలకు చెప్పాలి. అధికారంలో ఉండగా నాశనం చేసింది చాలక.. ఇప్పుడూ కుట్రలు చేస్తున్నారు. కిల్లింగ్ మనస్తత్వంతో ఉన్న పార్టీకి సంక్షేమం పట్టదు… అభివృద్ధి గిట్టదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకురావాలంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం ప్రత్యర్థులు చేస్తున్నారు. ఇంత అడ్డుకుంటున్నా… పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ కుట్రలకు కాలం చెల్లింది. OCD అనేది ఓ వ్యాధి… గొడ్డలి పార్టీకి CCD వ్యాధి సోకింది. క్రెడిట్ చోరీ డిజార్డరుతో గొడ్డలి పార్టీ మానసిక అనారోగ్యానికి గురైంది. వీళ్లని ఇలాగే వదిలేస్తే… దేశానికి స్వాతంత్ర్యం కూడా తామే తెచ్చానని చెబుతారు. ఆపరేషన్ సింధూర్ కు అవసరమైన డ్రోన్లను కూడా తామే పంపామని గొడ్డలి పార్టీ చెప్పేలా ఉంది. మనకే అనుమానం వచ్చేలా ఫేక్ ప్రచారం చేయడంలో గొడ్డలి పార్టీ ముందుంటుంది. సొంత బాబాయి వివేకాను హత్య చేసి నెపం మనపై నెట్టారు. వాళ్ల కార్యకర్తను కారుతో తొక్కించి… ఆ పాపాన్ని మన పైకే నెట్టారు. కబ్జా చేసిన ఆస్తుల కోసం కడపలో అనుచరుడినే చంపేశారు… వాస్తవాలు బయటపడితే ఎదురు దాడి చేస్తున్నారు. నా జీవితంలో రాజకీయ నేతలతో పోరాడాను కానీ… నేరస్తులతో పోరాడలేదు. తొలిసారిగా నేరస్తులతో పోరాడుతున్నాం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనది అభివృద్ధి.. వాళ్లది అవినీతి… మనది వికాసం… వాళ్లది విధ్వంసం. మనం రిలాక్స్ అయితే.. అబద్దాలు ప్రపంచమంతా తిరుగుతాయి. అందుకే ప్రజలను నిత్యం అప్రమత్తం చేయాలి.”అని టీడీపీ జాతీయాధ్యక్షుడు దిశా నిర్దేశం చేశారు.

ఫ్లెక్సీల కోసం… కుర్చీల కోసం గొడవలొద్దు…

“తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ. కార్యకర్తల నుంచి అధ్యక్షుడి వరకు క్రమశిక్షణతో పని చేయడం పార్టీ మూల సిద్దాంతం. ప్రజలతో సౌమ్యంగా ఉండాలి… అందుబాటులో ఉండాలి. ప్రజలకు-ప్రభుత్వానికి వారధిగా ఉండాలి. నేతలు.. కార్యకర్తలు తప్పు చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి.. నేను చాలా మనస్థాపానికి గురయ్యాను. మనం సుపరిపాలనా యజ్ఞం చేస్తున్నాం.. మన వాళ్లు కూడా సరిగా వ్యవహరించకుంటే బాధ కలుగుతుంది. నేను-పవన్ కళ్యాణ్ చక్కగా ఉంటున్నాం. మంచి రిలేషన్ కొనసాగిస్తున్నాం. ఇదే క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా వ్యవహరించాలి. బీజేపీని కలుపుకుని వెళ్లాలి.. రాష్ట్రానికి-కేంద్రానికి గ్యాప్ లేదు.. రాకూడదు. చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు… ఫ్లెక్సీల దగ్గర, ఫొటోల దగ్గర, కుర్చీల దగ్గర గొడవలొద్దు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా గ్రామ స్థాయి కార్యకర్తలు దీన్ని గుర్తు పెట్టుకోవాలి.”అని చంద్రబాబు హితవు పలికారు.

ప్రజలు గమనిస్తున్నారనే స్పృహతో ఉండాలి…

“నేతలు, కార్యకర్తలు అతిగా ప్రవరిస్తే ప్రజలు హర్షించరు. గతంలో పాలకుల గర్వాన్ని, అహంకారాన్ని చూశాం… ప్రజలు ఆ పార్టీకి బుద్ది చెప్పారు. బూతులు, వివాదాలు, దాడులు, గొడవలు, సెటిల్మెంట్లకు దూరంగా ఉందాం. మనకు ప్రజలు సహకరించారు.. నమ్మకం పెట్టుకున్నారు.. ప్రస్తుతం ప్రజలు మనల్ని గమనిస్తున్నారు. ఎవరైనా అధికారం ఉందని ఇగోలకు పోతే.. భవిష్యత్తులో నష్టం జరుగుతుంది. నేతలు తమ కింద వాళ్లకు కూడా సత్ప్రవర్తనను నేర్పించాలి. కీలక పదవుల్లో ఉన్న వారు తప్పు చేస్తే మీడియాలో హెడ్డింగులు వస్తాయి. అనునిత్యం పని చేయడంతోపాటు.. పార్టీ క్రమశిక్షణను కూడా కాపాడాలి. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా ఉండొద్దు… మళ్లీ మళ్లీ ఎన్నిక కావాలి. అందరూ మనస్పర్థలు లేకుండా పని చేయాలి. తాను లేకుండా ఎంపీ తమ ప్రాంతానికి రాకూడదని ఎమ్మెల్యేలు అనడం కరెక్ట్ కాదు. టిక్కెట్ ఇచ్చిన వారి వెంటే కేడర్ ఉంటారు. ఇదే టీడీపీ స్పెషాల్టీ. లీడర్లు ఈ విషయాన్ని నిత్యం గుర్తుంచుకోవాలి. పర్మిషన్లతో పదవులు ఇవ్వరు.. పని చేసిన వారికే పదవులిస్తాం. అన్నీ తెలుసని తప్పులు చేయొద్దు.. నేర్చుకుందాం.. రాష్ట్రానికి ఉపయోగపడాం.”అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *