-సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సుమారు 12.5 లక్షల ఎకరాల్లో రైతాంగం పండించిన మొక్కజొన్న పంటను మార్క్‌ఫెడ్, నాఫెడ్ల ద్వారా సత్వరం కొనుగోలు కేంద్రాలు తెరచి మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలని సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో మే 5వ తేదీన మండల కేంద్రాలలో ధర్నాలు నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, రైతుసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్‌లు నేడొక ప్రకటనలో పిలుపునిచ్చారు.
రైతాంగం లాభాలు వచ్చే పంటలవైపు దృష్టిసారించాలని రైతాంగాన్ని ప్రోత్సహించిన ప్రభుత్వం నేడు మొక్కజొన్న పంట మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయకుండా వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు వదిలి వేసిందన్నారు. దీంతో వ్యాపారస్థులు క్వింటా 1400 నుండి 1,700 రూపాయలు మాత్రమే కొంటున్నారని కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటా రూ॥ 2400 ఉండగా మార్కెట్ ధరల ప్రకారం ప్రతి రైతు క్వింటాకు 700 నుండి 800 రూపాయలవరకు నష్టపోతున్నారన్నారు. పంట మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు వ్రాస్తూ రైతాంగాన్ని మభ్యపెడుతూ కొనుగోళ్ళలోt తీవ్ర జాప్యం చేస్తున్నదన్నారు. మార్చి 26న కేంద్ర వ్యవసాయశాఖామంత్రికి ముఖ్యమంత్రి లేఖ వ్రాసారని కేంద్రం నుండి ఎటువంటి స్పందనా లేకపోవడంతో తిరిగి మరో పర్యాయం ఏప్రియల్ 27న లేఖ వ్రాసారన్నారు. లేఖలతో రైతాంగాన్ని మభ్యపెడటం మానుకోవాలని కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు కోరారు. తెలంగాణా, కర్నాటక, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం కొనుగోలు జరగకపోవడంతో ప్రతి రైతు ఎకరానికి సుమారుగా 25000 వేల రూపాయలు నష్టపోవలసివస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి కేంద్ర ప్రభుత్వంతో స్వయంగా సంప్రదించి మార్క్‌ఫెడ్, నాఫెడ్ల ద్వారా కొనుగోలు కేంద్రాలు తెరచి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కోరుతూ మే 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న పండే ప్రాంతాలలోని మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని రైతాంగానికి జి. ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్ పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News