-కుటుంబంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను పెంచాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయమైన హరితాంధ్రప్రదేశ్ నిర్మించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద విఎంసి సిబ్బందికి పూల మొక్కలను కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత కాలుష్యం దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయమైన హరితాంధ్రప్రదేశ్ లో భాగంగా నగర ప్రజలకు వారి ఇళ్లలో మిద్దె పైన పూల మొక్కలను పెంచుకునే అవకాశం కల్పించే దిశగా నగరపాలక సంస్థ 10,000 ఉచిత పూల మొక్కలను పంపిణీ చేస్తుందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఇంట్లో మొక్కలను పెంచే అలవాటు చేసుకోవాలని, కుటుంబ సభ్యుల్లో ఉండే ప్రతి ఒక్కరికి కనీసం ఒక మొక్క అయినా ఇంట్లో ఉండాలని, అప్పుడే కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా ఆరోగ్యకరమైన శ్వాసని ప్రతి ఒక్కరు తీసుకోగలుగుతారని అన్నారు. ఒకవైపు నగరపాలక సంస్థ రోడ్లకి ఇరువైపులా, మీడియన్ లలో, అవకాశం ఉన్న ప్రతి చోట మొక్కలను నాటే కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రజలు కూడా తమ వంతు కృషిగా ప్రతి ఇంట్లో మొక్కలను పెంచాలని అన్నారు.
పూల మొక్కలను ఎన్జీవోలు, టెర్రస్ గార్డెన్ గ్రూపులు, స్కూళ్లు, స్వయం సహాయక బృందాలు, పార్కుల అసోసియేషన్ల సహాయంతో ఉచితంగా పంపిణీ చేస్తున్నప్పటికీ, నగర ప్రజలు ఉచితంగా పూల మొక్కలను తీసుకునేందుకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉద్యానవన శాఖను సంప్రదించగలరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ కే సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి. సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ మేనేజర్ వి. ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News