-సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైకల్యాన్ని జయించి, అకుంఠిత దీక్షతో సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై ఆంధ్రప్రదేశ్ జెండాను ఎగురవేసిన 21 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు (CwSN) అందరికీ ఆదర్శప్రాయులని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు, IAS., ప్రశంసించారు.
నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను విజయవంతంగా అధిరోహించి, శుక్రవారం సురక్షితంగా విజయవాడ చేరుకున్న విద్యార్థుల బృందం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఎస్పీడీ ని కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ 16 రోజుల సాహసయాత్రలో ఎదురైన సవాళ్లను, అనుభవాలను వారితో పంచుకున్నారు.
ఈ సందర్భంగా బి.శ్రీనివాసరావు, IAS., మాట్లాడుతూ: ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఈ చిన్నారుల పట్టుదల అమోఘమని, పేదరికాన్ని, శారీరక వైకల్యాన్ని అధిగమించి ఈ స్థాయికి చేరుకోవడం గర్వకారణమని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ, ప్రోత్సాహం, సమగ్ర శిక్ష అందించిన కఠిన శిక్షణే ఈ విజయానికి పునాది” అని పేర్కొన్నారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో చదువులో, ఇతర రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్పీడీ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్పీడీ కె.రవీంద్రనాథ్ రెడ్డి, ఇన్ క్లూజీవ్ ఎడ్యుకేషన్ విభాగం సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News