Breaking News

కార్గిల్ యుద్ధం భారతదేశ శక్తిని చాటింది..

-దేశ సార్వభౌమత్వాన్ని కాపాడింది
-భారత దేశ పౌరుల్లో స్ఫూర్తిని నింపింది
-చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్ల
-తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అమరవీరులకు నివాళులర్పించి న చిత్తూరు ఎంపీ, తిరుపతి జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
1999వ సంవత్సరంలో జరిగిన కార్గిల్ యుద్ధం భారతదేశ శక్తిని చాటిందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. అదే సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడిందని, భారతీయ పౌరుల్లో స్ఫూర్తిని నింపిందని గుర్తు చేసుకున్నారు.

కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, మరియు దేశంలోని అత్యంత విజయవంతమైన ఆపరేషన్ “సిందూర్” విజయవంతమైన నేపథ్యంలో లెఫ్టినెంట్ జనరల్ వెంకటేశ రెడ్డి ఆధ్వర్యంలో 21 మంది వెటరన్స్ బృందం “విజయ అమృత్ కలశ్” యాత్రను చేపట్టారు. ఈ యాత్ర సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్కు చేరుకుంది. ఈ బృందానికి సాదర స్వాగతం పలికిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు..విజయ అమృత్ కలశ్ యాత్రకు శ్రీకారం చుట్టిన లెఫ్టినెంట్ జనరల్ వెంకటేశ రెడ్డి దేశ సేవను అభినందించారు.

ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు వెటరన్స్ బృందంతో కలిసి కార్గిల్ యుధ్ధంలో అసువులు బాసిన అమర వీరులకు నివాళులు అర్పించారు.అలాగే విజయ అమృత్ కలశాల పై పుష్పాలు సమర్పించి, అమరవీరులకు జోహార్లు అర్పించారు .

చిత్తూరు పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ..
“కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో తనకు సుమారు 38 నుంచి 40 ఏళ్లు ఉండేవని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో ప్రతిరోజూ రేడియోలలో ,పత్రికల్లో యుద్ధ విశేషాలను చాలా ఆసక్తిగా వినేవాడిని, చదివేవాడిని. అప్పటి యుద్ధం ఇప్పటిలా క్షిపణులు లేదా వైమానిక దళంతో కాకుండా, ప్రధానంగా భూమి పై సైనికుల మధ్య సాగిందని చెప్పారు.ఆ సమయంలో మన సైన్యం అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొందనీ,. పాకిస్థాన్ సైనికులు ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉండటం వల్ల వారు సులభంగా మన పై బాంబులువేయగలిగేవారనీ.అయితే మన సైనికులు కింద నుండి పైకి వెళ్తూ, పైన ఏం జరుగుతుందో స్పష్టంగా తెలియకపోయినా ప్రాణాలకు తెగించి పోరాడి విజయం సాధించారనీ అలనాటి స్మృతులను గుర్తు చేశారు. ఆ యుద్ధంలో బోఫోర్స్ (Bofors)** గన్స్ మనకు గొప్ప విజయాన్ని అందించాయన్నారు. యుద్ధం వల్ల ప్రాణనష్టం , ఆయుధాల నష్టం ఎక్కువగా జరిగినప్పటికీ, మన సైనికుల పట్టుదలతో భారతావనికి విజయం సాధించి, జాతీయ పతాకాన్ని ఎగురవేశారని తెలిపారు.సైన్యంలో ఉన్నవారికైనా లేదా రిటైర్డ్ సైనికులకైనా మనం తగిన గౌరవం ఇవ్వడం మన బాధ్యత అని తెలిపారు. సార్వభౌమత్వాన్ని కాపాడే సైనికులకు ఈ రోజుల్లో దక్కాల్సిన గౌరవం కొంత తగ్గుతోందని తాను భావిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహనను మరియు గౌరవాన్ని పెంచుతాయనని అన్నారు.. ఈ యాత్ర జూలై 26, 2026 నాటికి విజయవంతంగా కార్గిల్ చేరుకోవాలని, ఇది దేశంలోని పౌరులందరిలో స్ఫూర్తిని నింపాలని తాను కోరుకుంటున్నానని తెలియజేశారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. విజయ్ అమృత్ కలాష్ యాత్రలో భాగమైనందుకు తనకు చాలా గర్వంగా మరియు సంతోషంగా ఉందన్నారు. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు తాను నాలుగో తరగతి చదువుతున్నానని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో దేశం మొత్తం ఏకతాటిపైకి రావడం తనకు ఇప్పటికీ గుర్తుందని, కేవలం సాయుధ దళాలే కాకుండా, భారతదేశంలోని ప్రతి పౌరుడు అమరవీరులకు అండగా నిలిచి దేశభక్తిని చాటుకున్నారని చెప్పారు. కార్గిల్ యుద్ధం భారత సైన్యం పరాక్రమానికి, శక్తికి నిదర్శనంగా నిలిచిందన్నారు. యుద్ధం ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ, ఇది మన దేశానికి, సైన్యానికి లభించిన గొప్ప విజయమని కలెక్టర్ కొనియాడారు. ఆ యుద్ధానికి గుర్తుగా..రిటైర్డ్ ఆర్మీ వెటరన్స్ బృందం ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. విజయ అమృత్ కలశ్” యాత్రను శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుతో కలిసి ప్రారంభించడం తనకు గర్వకారణంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో బ్రిగేడియర్ శివ శంకర్ సార్, కల్నల్ బి.యు. హరి, మేజర్ రఘురామ్ రెడ్డి, కెప్టెన్ ఎస్.సి. భండారి మరియు యుద్ధంలో పాల్గొన్న ఇతర సభ్యులు, రిటైర్డ్ ఆర్మీ వెటరన్స్ బృందం ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *