-గోదావరి పుష్కరాలకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.. తదనునుగుణంగా భారీ ఏర్పాట్లు – మంత్రి కందుల దుర్గేష్
-భక్తుల భద్రతే కూటమి ప్రభుత్వ బాధ్యత.. ఏడాది ముందుగానే పుష్కర పనుల శ్రీకారం
-“పుష్కర నిధులతో మున్సిపాలిటీల్లో శాశ్వత అభివృద్ధి.. పర్యాటకశాఖ తరఫున టెంట్ సిటీలు, హోమ్ స్టేల ఏర్పాటు: మంత్రి కందుల దుర్గేష్”
-“రాజమహేంద్రవరంలో త్వరలో అఖిల పక్ష శాఖల సమీక్ష.. పుష్కర పనులపై మంత్రి దుర్గేష్ క్లారిటీ”
-“కేంద్ర, రాష్ట్ర నిధులతో పుష్కర ఘాట్లు, రోడ్ల అభివృద్ధి.. త్వరలోనే నిధుల విడుదల: మంత్రి కందుల దుర్గేష్”
-“2015 అనుభవాలతో.. 2027 పుష్కరాలకు ముందస్తు వ్యూహం: మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం”
-జోనల్ సిస్టమ్ ద్వారా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు.. గోదావరి పుష్కరాలకు సర్వం సిద్ధం చేస్తామని వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు, మున్సిపల్ అధికారులు పుష్కరాల ఏర్పాట్లు, నిధుల అంచనాలపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ “గతంలో 2015 పుష్కరాల సమయంలో కేవలం మూడు నెలల ముందే పనులు ప్రారంభించాం. కానీ ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఏడాదిన్నర ముందు నుంచే పనులు మొదలుపెట్టి అత్యంత నాణ్యతతో పూర్తి చేస్తాం.” అన్నారు.
పుష్కరాల నిధులతో కేవలం తాత్కాలిక ఏర్పాట్లే కాకుండా, మున్సిపాలిటీల్లో శాశ్వత ప్రాతిపదికన రోడ్లు, డ్రైనేజీలు, ఘాట్లు, తాగునీరు మరియు పార్కులను అభివృద్ధి చేస్తాం. దీనివల్ల ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుంది అని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
“ఈ పుష్కరాలకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. భక్తుల సౌకర్యార్థం పర్యాటక శాఖ ద్వారా ‘టెంట్ సిటీ’లు ఏర్పాటు చేయడంతో పాటు, స్థానిక ఇళ్లలో ‘హోమ్ స్టే’లను ప్రోత్సహిస్తున్నాం. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు జోనల్ సిస్టమ్ అమలు చేస్తామన్నారు.
రాజమహేంద్రవరంలో త్వరలో భారీ సమీక్ష:
“ప్రస్తుతం మున్సిపల్ శాఖపై సమీక్ష జరిగింది. త్వరలోనే రాజమండ్రిలో ఇరిగేషన్, దేవదాయ మరియు ఇతర అన్ని శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించి కార్యాచరణను ఖరారు చేస్తాం.” అని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.
మంత్రి నారాయణ అధ్యక్షతన మున్సిపాలిటీల వారీగా (రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, మండపేట) చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారని మంత్రి దుర్గేష్ వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు పనుల ప్రాధాన్యత క్రమాన్ని వివరించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అర్బన్ ఫండింగ్ మరియు ఇతర పారామీటర్ల ఆధారంగా త్వరలోనే నిధులు విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇచ్చిన పలు కీలక సూచనలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారి భద్రతే పరమావధిగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, వచ్చే ఏడాది నాటికి అన్ని పనులను పూర్తి చేసి పుష్కరాలను ఒక చారిత్రక ఘట్టంగా మారుస్తామని మంత్రి కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి,జోగేశ్వర రావు,బత్తుల బలరామకృష్ణ,ముప్పిడి వెంకటేశ్వర రావు,మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్,డైరెక్టర్ సంపత్ కుమార్,పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్,రాజమహేంద్రవరం,కొవ్వూరు,నిడదవోలు,మండపేట, మున్సిపల్ కమిషనర్లు,అధికారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News