– శిక్షణ, రుణం, మార్కెట్ సహాయంతో ప్రగతి దిశగా పయనం
– తొలి దశలో నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో ఐఈడీపీ
– దశల వారీగా అన్ని మండలాల్లోనూ అమలుకు కసరత్తు
– ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఎన్ఎస్ఎఫ్‌డీసీ సీజీఎం సి.రమేష్ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్‌సీ కుటుంబాల సమీకృత ఆర్థిక అభివృద్ధికి సమష్టిగా కృషిచేయడం జరుగుతోందని.. సమీకృత ఆర్థిక అభివృద్ధి కార్యక్రమం (ఐఈడీపీ) ద్వారా ముఖ్యంగా ఎస్సీ కుటుంబాల సమగ్ర ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఎన్ఎస్ఎఫ్‌డీసీ సీజీఎం సి.రమేష్ రావు అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఐఈడీపీపై జిల్లా అధికార యంత్రాంగం, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫైనాన్ష్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశతో పాటు ఎన్ఎస్ఎఫ్‌డీసీ చీఫ్ జనరల్ మేనేజర్ సి.రమేష్ రావు, డీజీఎం అమిత్ భాటియా తదితరులు హాజరైన ఈ సమావేశంలో ఎస్‌సీ కుటుంబాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అందుబాటులో ఉన్న పథకాలు, వాటిని సద్వినియోగం చేసుకునేలా అందించాల్సిన ప్రోత్సాహంపై చర్చించారు. స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ-సూక్ష్మ రుణ సంస్థలు, సహకార సొసైటీలు, సహకార బ్యాంకుల ద్వారా అమలయ్యే పథకాలకు సంబంధించి ఎన్ఎస్ఎఫ్‌డీసీ అధికారులు వివరించారు. ఎన్ఎస్ఎఫ్‌డీసీ.. కేశినేని ఫౌండేషన్ భాగస్వామ్యంతో తొలిదశలో నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో ఐఈడీపీ అమలు చేయనున్నట్లు తెలిపారు. తర్వాత జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, స్త్రీ నిధి, ఏపీఎస్ఎఫ్‌సీ, భాగస్వామ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రాయితీ రుణాలు అందించడం ద్వారా ఎస్సీ కుటుంబాలకు అవసరాల ఆధారంగా జీవనోపాధి కార్యక్రమాలను ప్రోత్సహించడం సమీకృత ఆర్థిక అభివృద్ధి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మొదటి దశలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్‌డీలో శిక్షణ పొందిన సుమారు 100 మంది ఎస్సీ మహిళలకు రుణ అనుసంధానం కల్పించడం జరుగుతుందన్నారు.
ఎన్ఎస్ఎఫ్‌డీసీ సీజీఎం సి.రమేష్ రావు మాట్లాడుతూ.. ఇంకా ఐఈడీపీ మొత్తం వ్యయం రూ. 20 కోట్లు కాగా, సుమారు 2000 మంది ఎస్సీ లబ్ధిదారులకు యూనిట్‌కు సగటున రూ. లక్ష చొప్పున రుణం అందించబడుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఐఈడీపీ ద్వారా ప్రత్యేకంగా పారిశ్రామిక సామర్థ్యాభివృద్ధి, సంప్రదాయ కళాకారుల అభ్యున్నతి జీవనోపాధి కార్యక్రమం కింద బ్రాండ్ అభివృద్ధి, మార్కెటింగ్ సహాయం వంటి పలు చర్యలు ఉంటాయన్నారు. వీటికి అదనంగా సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఎగ్జిబిషన్లు/ప్రదర్శనల్లో లబ్ధిదారులు పాల్గొనడం కూడా ఇందులో భాగంగా ఉంటుందని వివరించారు.
కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పశు సంవర్థక, ఉద్యాన రంగాల్లో అభివృద్ధికి పుష్కల అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ రంగంలో ఏ2 మిల్క్, ది గోట్ ట్రస్ట్ ద్వారా వినూత్న ప్రాజెక్టుల అమలుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం కింద కూడా లబ్ధిపొందేందుకు లబ్ధిదారులను గుర్తించి శిక్షణతో పాటు రుణ మద్దతు, మార్కెటింగ్ సహకారం అందించి ఎస్‌సీ కుటుంబాల అభివృద్ధికి కృషిచేయనున్నట్లు తెలిపారు.
సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, ఎల్‌డీఎం కె.ప్రియాంక, పశు సంవర్థక అధికారి డా. ఎం.హనుమంతరావు, ఉద్యానశాఖ అధికారి పి.బాలాజీ కుమార్, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, ఎస్‌సీ కార్పొరేషన్ ఈవో పీటీ సెల్వి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News