-ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభకు MLA బొండా ఉమామహేశ్వరరావు పూల మాల వేసి ఘన సన్మానం చేసి, విద్యార్థులకు కాలేజ్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, స్వీట్స్ ను తన సొంత నిధులతో అందజేశారు
-586 మార్కులతో న్యూ రాజరాజేశ్వరి పేట విద్యార్థిని ద్రాక్షాయణి రికార్డు సృష్టి MLA బొండా ఉమామహేశ్వరరావు 10,000 వేల రూపాయల బహుమానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయం వద్ద మంగళవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఇటీవల నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఘనంగా అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కాలేజ్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, స్వీట్స్ పంపిణీ చేయడంతో పాటు, వారి భవిష్యత్తు విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:- కేర్ & షేర్ పాఠశాలకు చెందిన విద్యార్థిని ద్రాక్షాయణి (586) మార్కులు సాధించి నియోజకవర్గంలో అత్యధిక మార్కులు సాధించడం విశేషమని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఏకేటీపీ పాఠశాల నుండి రామ్ చరణ్ (583), ముత్యాలంపాడు (581), ప్రసన్న కుమారి (580), లోహిత్ (584) తదితర విద్యార్థులు కూడా అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు ప్రశంసలు అందుకున్నారు, ఈ ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల సామర్థ్యాన్ని, విద్యార్థుల ప్రతిభను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.
ద్రాక్షాయణి తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ తమ కుమార్తె చదువుకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని పేర్కొంటూ, ఆమె భవిష్యత్తు విద్యాభ్యాసానికి వ్యక్తిగతంగా రూ.10,000 ఆర్థిక సహాయం ప్రకటించారు, అవసరమైతే ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని, చదువు కోసం ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తానని హామీ ఇచ్చారు.
ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల్లో లక్షల రూపాయల ఫీజులు చెల్లించి చదువుతున్న విద్యార్థులతో సమానంగా, కొన్ని సందర్భాల్లో మరింత మెరుగైన మార్కులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించడం నిజంగా గర్వకారణమని తెలిపారు. ఇది ప్రభుత్వ పాఠశాలలలో అందిస్తున్న నాణ్యమైన విద్య, విద్యార్థుల కృషి, టీచర్ల అంకితభావానికి ప్రతీక అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు నాణ్యతలో ఎలాంటి తేడా లేకుండా విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, యూనిఫామ్స్, బ్యాగులు, షూస్ వంటి అవసరమైన అన్ని సదుపాయాలను ఉచితంగా అందిస్తున్నదని, అలాగే పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం ద్వారా విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నదని వివరించారు. “తల్లికి వందనం” వంటి పథకాల ద్వారా తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం జమ చేస్తూ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, ప్రతి విద్యార్థి భవిష్యత్తును బలోపేతం చేసే దిశగా కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో బీఈడీ అర్హత కలిగిన ప్రొఫెషనల్ టీచర్లు మాత్రమే బోధన నిర్వహిస్తారని, వారికి సబ్జెక్ట్‌పై పూర్తి పట్టు ఉండటం వల్ల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతోందని చెప్పారు. టీచర్లు తమ సొంత పిల్లలకన్నా ఎక్కువ ప్రేమతో, బాధ్యతతో విద్యార్థులను ముందుకు నడిపిస్తున్నారని, వారి కృషి వల్లే ఈరోజు మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని కొనియాడారు.
విద్యార్థుల విజయమే ప్రభుత్వం మరియు టీచర్లకు నిజమైన ప్రతిఫలమని, వారి నుంచి ఎటువంటి ఆర్థిక లాభం ఆశించడం లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని కష్టపడి చదివితే ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్-1 అధికారులు, డాక్టర్లు, ఇంజనీర్లు వంటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. రేపటి రోజుల్లో మీరు ఏ రంగంలో ఉన్నా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని, దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని స్పష్టంగా చెప్పారు.
విద్యార్థులు ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్యల్లో ముందుకు సాగాలని, కష్టపడి చదివితే ఏ పాఠశాల లేదా కాలేజీ అయినా విజయాన్ని సాధించవచ్చని సూచించారు. క్రమశిక్షణ, శ్రద్ధ, పట్టుదలతో చదువుకుంటే ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని సాధించగలడని, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదిగి ప్రజా ప్రయోజనానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు కార్యదర్శి SK. గౌసియా, పైడి శ్రీను, SK ఫర్వీన్, దొండపాటి సుల్తానా, SD గౌసియా, ప్రభుత్వ పాఠశాలల విద్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News