-బాబా సాహెబ్ జీవితం తరతరాలకు ఆదర్శం
-ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డిల చేతుల మీదుగా బి.ఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక న్యాయం కోసం జరిగే సమరశీల పోరాటాలపై చెరగని ముద్రవేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని కరెంట్ ఆఫీస్ వద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి తో కలిసి శాసనసభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎంతో కృషి చేశారని.. సమసమాజాన్ని నిర్మించడానికి జీవితకాలం కష్టపడ్డారన్నారు. వివక్షను సమాజం నుంచి తరిమికొట్టేందుకు, అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసేందుకు రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. సామాజిక న్యాయం, స్వాతంత్య్రం, అంటరానితనం, రిజర్వేషన్లపై తనదైన శైలిలో రాజ్యాంగంలో వివరణలు ఇచ్చారని చెప్పారు. సమాజంలోని మార్పులను ముందే అంచనా వేసి, పరిష్కారాలను ఆనాడే రాజ్యాంగంలో సూచించిన వ్యక్తి అంబేద్కర్ అని కీర్తించారు. ఆయన మూలంగానే ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగ దేశంగా భారతదేశం అవతరించిందన్నారు. అంబేద్కర్ ఆలోచనలు రాబోయే తరాలకు కూడా మార్గదర్శకమని మల్లాది విష్ణు అన్నారు. కార్యక్రమంలో విగ్రహ దాతలు ఎం.కోటేశ్వరరావు, ఎం జాన్ బాబు, నాయకులు మన్నం అశోక్, చిన్ని, జోజి, ఆనంద్, మోజస్, రవి తదితరులు పాల్గొన్నారు.