-అంబేద్కర్ ఆశయ సాధకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
-బాబా సాహెబ్ స్ఫూర్తిగా సమాజ సేవకు అంకితమవ్వాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజ శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయులు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని.. ఆయన స్ఫూర్తిగా ప్రతిఒక్కరూ సమాజ సేవకు అంకితమవ్వాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద ఉన్న విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం తో కలిసి పూలమాల వేసి గౌరవ శాసనసభ్యులు ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉన్నాయన్నారు. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం బాబా సాహెబ్ చేసిన అలుపెరుగని పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుందన్నారు. రాజ్యాంగమంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనే కాదని.. కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించాలన్నది ఆయన ప్రధాన ఆశయమన్నారు. అంబేద్కర్ కృషి ఫలితంగానే ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారతరాజ్యాంగం ఉన్నతవిలువలు కలిగిందంటూ వివరించారు.
అంబేద్కర్ ఆలోచనా విధానంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ.. కులమతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. విద్యా, వైద్యానికి పెద్ద పీట వేసి అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా విజయవాడ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు ఊరు చివర అంబేద్కర్ విగ్రహం పెడతానని మోసం చేశారని.. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగర నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుండె సుందర్ పాల్, కుక్కల రమేష్, మానం వెంకటేశ్వరరావు, బెజ్జం రవి, అంగిరేకుల విజయ్, ఎం.కిరణ్ కుమార్, వెంకటేశ్వరరావు, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
వార్డు సచివాలయ సందర్శన…
సంక్షేమ క్యాలెండర్ పై లబ్ధిదారులను చైతన్యపరచడమే సచివాలయ సిబ్బంది ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ముత్యాలంపాడులోని 211 వార్డు సచివాలయాన్ని స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష్ సత్యం తో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన సేవలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదన్నారు. జనవరి మాసంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై ఇప్పటినుంచే సన్నద్ధంగా ఉండాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరైన జగనన్న ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులను శాసనసభ్యులు అందజేశారు.