-విజయవాడ, నందిగామ, తిరువూరు డివిజన్లలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన
-విజయవంతంగా ముగిసిన ఓటింగ్ ప్రక్రియ: జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
-పకడ్బందీ భద్రత, వెబ్‌కాస్టింగ్ నిఘా నడుమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ముగింపు
-ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు, సహకరించిన అధికార యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి కలెక్టర్ అభినందనలు
విజయవాడ/నందిగామ/తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించిన జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ వెల్లడించారు. ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5.00 గంటల వరకు నిరంతరాయంగా, పారదర్శకంగా కొనసాగిందని తెలిపారు. సాయంత్రం 5.00 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ నిబంధనల ప్రకారం టోకెన్లు జారీ చేసి ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ ఉదయం నుంచే విజయవాడ, నందిగామ, తిరువూరు డివిజన్లలో విస్తృతంగా సుడిగాలి పర్యటన చేపట్టారు. విజయవాడ రూరల్ మండలం బోడపాడు, జి.కొండూరు మండలం వెలగలేరు, మైలవరం మండలం పుల్లూరు, కంచికచర్ల మండలం పరిటాల, ఏ.కొండూరు మండలం రామచంద్రాపురం తదితర పోలింగ్ కేంద్రాలను ఆయన స్వయంగా సందర్శించి ఓటింగ్ సరళిని, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మొత్తం 992 పోలింగ్ కేంద్రాల్లో 5,200 మందికి పైగా ఎన్నికల సిబ్బంది, పోలీసు బందోబస్తు సమన్వయంతో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలతో పాటు మొత్తం 496 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీటీవీల ద్వారా జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం నిఘా ఉంచామని, దీనివల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల నుంచి విశేష స్పందన లభించిందని, పట్టణాలు, ఇతర దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సైతం తమ స్వగ్రామాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పిందన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీగా సీల్ చేసి, కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్ణీత స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఎన్నికల నిర్వహణలో అంకితభావంతో విధులు నిర్వర్తించిన ఎన్నికల సిబ్బందికి, పోలీసు అధికారులకు, మీడియా ప్రతినిధులకు, శాంతిభద్రతల పరిరక్షణలో సహకరించిన ఓటర్లందరికీ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
