-సీపీ కాంతిరాణా టాటా
-అక్షయపాత్ర సహకారంతో పాత్రికేయులకు నిత్యావసర సరుకుల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా విపత్కర సమయంలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సమాజాన్ని చైతన్యవంతులను చేసేందుకు జర్నలిస్టులు అందించిన సేవలు అమోఘమని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా అన్నారు. అక్షయ పాత్ర ఆర్థిక సహకారంతో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ యూనిట్ ఆధ్వర్యాన శనివారం జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీ కాంత్రిరాణా టాటా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కరోన విపత్తు సమయంలో పోలీసులతోపాటు జర్నలిస్టులు అద్భుతంగా పని చేశారని కొనియాడారు. కరోనా బారినపడిన పోలీసు అధికారులు, సిబ్బందికి డీజీపీ డి.గౌతం సవాంగ్ నేతృత్వంలో వైద్యంతోపాటు అన్ని విధాలుగా సాయం చేశారని తెలిపారు. తాను గతంలో విజయవాడలో డీసీపీగా, జాయింట్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించానని, విధి నిర్వహణలో జర్నలిస్టులు మంచి సహకారం అందించారని తెలిపారు. జర్నలిస్టులతో అదే తరహాలో సత్సంబంధాలు కొనసాగిస్తానని, అవసరమైన సహకారం అందిస్తానని చెప్పారు. సమాజ హితం కోసం పని చేసే జర్నలిస్టులకు అక్షయపాత్ర నిర్వాహకులు నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని అన్నారు. ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ కరోనా లాక్‌డౌన్ సమయంలో నిరుపేదలను ఆదుకునేందుకు అక్షయపాత్ర అందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు. ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అక్షయపాత్ర కో`ఆర్డినేటర్ వంశీధర్ దాస, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, ఏపీయూడబ్ల్యూజే అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, న్యాయవాది ప్రసన్న వైట్ల ప్రసంగించారు.