-జగనన్న పాలవెల్లువ పధకం కింద జిల్లాలో 303 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది..
-జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) కె. మాధవీలత
పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళాపాడి రైతుల ఆర్థికాభివృద్ధికి జగనన్న పాలవెల్లువ పధకం ఎంతో దోహదపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) కె. మాధవీలత అన్నారు. జగనన్న పాలవెల్లువ పధకం లో భాగంగా స్థానిక వెలుగు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం గ్రామ డైరీ సంఘ కార్యదర్సులు, ప్రమోటర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాధవిలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ మహిళా పాడి రైతుల ఆర్థికాభివృద్దే లక్ష్యంగా జగనన్న పాలవెల్లువ పధకాన్ని జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు త్వరలో ప్రారంభించనున్నారన్నారు. ప్రైవేట్ డైరీల కన్నా వెన్న శాతం కొలవడంలో అమూల్ సంస్థ ఖచ్చితత్వాన్ని పాటిస్తుందన్నారు. దీనివల్ల రైతులు లీటరుకు రూ.5 నుండి రూ.7 రూపాయలకు పైగా లాభాన్ని పొందుతారన్నారు. జగనన్న పాలవెల్లువ వలన కలిగే ప్రయోజనాలను పాడి రైతులకు తెలియజేసి ఈ పధకం విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ పధకం అమలుకు జిల్లాలో 303 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఆయా గ్రామాలలోని రైతు భరోసా కేంద్రం పరిధిలో గ్రామ డైరీ సంఘాన్ని ఏర్పాటు చేసి, ఒకొక్క సంఘంలో 11 మంది ప్రమోటర్లను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. పాల సేకరణ నిర్వహణకు అదే గ్రామంలోని కార్యదర్శి, సహాయక కారయదర్శులను నియమించడం జరుగుతుందన్నారు. పాల సేకరణ సక్రమంగా చేసేందుకు సంఘానికి 2 లక్షల విలువైన కంప్యూటర్లు, వెన్నశాతం కొలిచే యంత్రాలను అందించడం జరుగుతుందన్నారు. ఈ పధకం అమలుపై ప్రతీ గ్రామంలోనూ పాడి రైతులు, ప్రమోటర్లు, కార్యదర్శి, సహాయ కార్యదర్శులు, సచివాలయ డిజిటల్, వెల్ఫేర్, పశుసంవర్థక అసిస్టెంట్లులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ మాధవీలత తెలిపారు. శిక్షణా కార్యక్రమేంలో పశుసంవర్థక జాయింట్ డైరెక్టరు కె.విద్యాసాగర్, అసిస్టెంట్ డైరెక్టరు, యంపీడీవో రామకృష్ణ, ఈవో సలీమ్ జిల్లా కోఆర్డినేటర్ రత్నగిరిరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News