-మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఓటు వేయడానికి కూడా ముందుకు రాకుండా ఓటమి భయంతో పారిపోయారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రజాస్వామ్యం, ఎన్నికల పారదర్శకత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ప్రజాస్వామ్యంపై జగన్కు నిజంగా గౌరవం ఉంటే ప్రజల తీర్పును శిరసావహించాలి. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేక వ్యవస్థలపై నిందలు వేయడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.
2019లో మెజార్టీ స్థానాలు సాధించినప్పుడు ప్రజల తీర్పుగా చెప్పుకున్న జగన్.. 2024, ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఎందుకు గౌరవించడం లేదని మంత్రి ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలకు రాకుండా నాలుగు గోడల మధ్య మాత్రమే మైకు ముందు మాట్లాడే జగన్కు అధికారం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గొప్పగా కనిపించడం, అధికారం కోల్పోయాక అదే వ్యవస్థపై ఆరోపణలు చేయడం ఆయనలోని నైరాశ్యాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ఎన్నికల ప్రక్రియపై జగన్ చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడైనా లోపాలు ఉంటే చట్టబద్ధమైన మార్గాల్లో వాటిని నిరూపించుకోవాలి తప్ప, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. సంక్షేమ పాలన వల్ల కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలన తమ ప్రభుత్వ ప్రాధాన్యాలని తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పే అంతిమమని, ఆ తీర్పును గౌరవించలేని జగన్ ప్రజాస్వామ్య పాఠాలు చెప్పడం హాస్యాస్పదమని సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు.
