-కొండాపురం తీసుకొచ్చి పదో తరగతి చదువు కొనసాగించేలా చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా
-బాలిక తండ్రికి కౌన్సెలింగ్ నిర్వహించిన రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖ అధికారుల బృందం
-వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న కలెక్టర్, ఎస్పిను అభినందించిన మంత్రి నారా లోకేష్
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రత్యేక చొరవతో చదువుకు దూరమైన కొండాపురం కేజీబీవీ పాఠశాల పదో తరగతి విద్యార్థినిని తిరిగి పాఠశాలకు చేర్చి, ఆమె చదువును కొనసాగించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం బాలికను తిరిగి కొండాపురం తీసుకువచ్చి, కేజీబీవీ పాఠశాలలో మళ్లీ ప్రవేశం కల్పించింది. బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేలా ఆమె తండ్రికి విద్యాభ్యాసం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలిక మాట్లాడుతూ.. “నేను ఇటీవల పోస్ట్ చేసిన వీడియోను చూసిన వెంటనే స్పందించి, నన్ను తిరిగి కొండాపురం తీసుకువచ్చి, మళ్లీ పాఠశాలలో ప్రవేశం కల్పించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటానని మాట ఇస్తున్నాను” అని తెలిపింది.
బాలిక ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్షకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఆమె లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.
బాలిక సమస్యపై వెంటనే స్పందించి, ప్రత్యేక బృందాన్ని పంపించి ఆమెను తిరిగి పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల..ను మంత్రి నారా లోకేష్ అభినందించారు.
ఇటీవల చదువుకు దూరమై హైదరాబాద్‌లో తన తండ్రి వద్ద ఉంటున్న బాలిక, తిరిగి చదువుకోవాలనే తన ఆకాంక్షను, ఆవేదనను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ట్విట్టర్ ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే.
