-రెండున్నరేళ్ల సుపరిపాలనకు స్థానిక ఎన్నికల తీర్పు నిదర్శనం
-కొన్ని చోట్ల ఓటమిపై సమీక్ష… తప్పులు సరిదిద్దుకుంటాం
-కుప్పంలో ఓ ఎంపీటీసీ స్థానం ఓడినా… ప్రజాతీర్పును గౌరవించాం
-ప్రజల కోసం కష్టపడితే వెన్నంటే ఉంటారని నిరూపించారు
-గుడ్ గవర్నెన్స్ లీడ్స్ టు గుడ్ పాలిటిక్స్ మా విధానం
-క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల ఐక్యతకు అద్దం పట్టేలా స్థానిక ఎన్నికల ఫలితాలు
-స్థానిక ఎన్నికల ఫలితాలపై మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేశారని… తమ కోసం కష్టపడుతున్న ప్రభుత్వాన్ని గుర్తించి అండగా నిలిచారని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రెండున్నరేళ్ల సుపరిపాలనకు, అభివృద్ధికి ఆమోదం తెలిపారని… స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు అందించిన ఘనవిజయం ప్రభుత్వ పనితీరుకు లభించిన గుర్తింపు అని చంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలపై సోమవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… గుడ్ గవర్నెన్స్ లీడ్స్ టు గుడ్ పాలిటిక్స్ అన్నది తన నమ్మకమని, సుపరిపాలన అందిస్తే ప్రజలు రాజకీయంగానూ ఆదరిస్తారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. 2024 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు కూటమికి ప్రజల ఆదరణ మరింత పెరిగిందని, వైసీపీని గతంలో కంటే ఎక్కువగా ప్రజలు తిరస్కరించారని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థలు, పరిషత్ ఎన్నికలు.. ఈవీఎంలు, బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్లు.. ఏ విధంగా చూసినా ప్రజల మద్దతు కూటమికే లభించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపారని, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పల్నాడు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో వైసీపీ ఒక్క జెడ్పీటీసీని కూడా గెలుచుకోలేకపోయిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రజలు కేవలం పార్టీలను మాత్రమే కాకుండా, అభ్యర్థుల గుణగణాలను, వారి నేపథ్యాన్ని కూడా విశ్లేషించి ఓటు వేశారని చెప్పారు. పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూస్తామని, అదే విధంగా ప్రజలు కూడా తమ తరఫున పనిచేసే వ్యక్తుల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని, ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించారని అన్నారు. రాష్ట్ర ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
అండగా ఉన్నాం… ఆశీర్వాదం పొందాం…
రెండున్నరేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు, గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి పౌరుడికీ భద్రత, భరోసా కల్పిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని, సాగునీటి ప్రాజెక్టులతో సీమ కరవుకు చెక్ పెట్టామని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు కల్పించామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంటి పట్టాలు అందించామని, పేదలకు ఇళ్లు నిర్మించామని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని, ఇప్పుడు తొలిదశను ప్రారంభించి నీరందించడం ద్వారా రైతుల కష్టాలను తీర్చామని గుర్తు చేశారు. పోలవరం ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి తీసుకెళ్లామని చెప్పారు. దీన్ని ప్రజలు గుర్తించారని… ఓట్లతో ఆశీర్వదించారని సీఎం చంద్రబాబు అన్నారు. మార్కాపురంలో 21కి 21 జెడ్పీటీసీ స్థానాలను, అనకాపల్లిలో 24కి 24 స్థానాలను కూటమి గెలుచుకుందని గుర్తు చేశారు. విశాఖ మేయర్ స్థానాన్ని 2.50 లక్షల ఓట్ల మెజారిటీతో ప్రజలు కట్టబెట్టారని వివరించారు. ఇప్పుడే కాకుండా గతంలోనూ వివిధ సందర్భాల్లో ఇదే నిరూపితమైందని చెప్పారు. ప్రజల కోసం కష్టపడితే ప్రజలు ఆ పార్టీల వెన్నంటే ఉంటారని ఈ ఫలితాలు నిరూపించాయన్నారు.
అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం వివిధ సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వాములను చేసేలా అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెప్పారు. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కోసం విస్తృతంగా కసరత్తు చేసి, సమన్వయంతో ముందుకు వెళ్లామని చెప్పారు. రాజకీయ నేపథ్యం లేని సామాన్యులు కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించారని, ఇది రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది అని పేర్కొన్నారు. సీట్లు దక్కకపోయినా కూటమి ధర్మానికి కట్టుబడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. త్యాగాలు చేసిన కేడర్‌ను, నాయకులను గుర్తించి గౌరవిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టీడీపీ కేడర్ బేస్డ్ పార్టీ అని, సేవా భావమే తమ రాజకీయాలకు పునాది అని చెప్పారు. బీజేపీ, జనసేన, టీడీపీలు ఐక్యంగా పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని, ఇకముందూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు.
అసరమైతే కఠినంగా వ్యవహరిస్తాం
రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఘన విజయం సాధించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎదురైన ఓటములపై సమగ్రంగా సమీక్షించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురంలో ఓడిపోయే అవకాశమే లేదని… కానీ అక్కడ ఓటమి ఎదురైందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఆశించిన ఫలితాలు రాలేదని చెప్పారు. అరకు కాఫీ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేశామని తెలిపారు. అయినప్పటికీ అక్కడ ఫలితాలు ఎందుకు అనుకూలంగా రాలేదో విశ్లేషిస్తామని, ఓటర్లపై ఏమైనా ప్రలోభాల ప్రభావం పడిందా అనే విషయాలను కూడా వాస్తవాల ఆధారంగా పరిశీలిస్తామని చెప్పారు. ఒకట్రెండు స్థానాల్లో ఎందుకు ఓడిపోయామో లోతుగా విశ్లేషించుకుని, అవసరమైతే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎక్కడ పొరపాట్లు జరిగినా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తామని, తమకు ఎలాంటి భేషజాలు లేవని అన్నారు. మెజారిటీ పెరిగినప్పుడు మరింత అప్రమత్తంగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని పార్టీ నాయకులకు సూచించారు. కూటమి నిర్ణయాలను ఉల్లంఘించి వ్యవహరించిన వారిని ఉపేక్షించబోమని, రెబల్స్‌ను తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
గొడ్డలి పార్టీ కుట్రలకు చెక్…
కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు వైసీపీ అనేక ప్రయత్నాలు చేసిందని ముఖ్యమంత్రి విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్ఐఆర్ ప్రక్రియ, డీలిమిటేషన్ వంటి అంశాలపై పిటిషన్లు వేసి స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నించిందని అన్నారు. అయితే వారి ప్రయత్నాలకు సుప్రీంకోర్టు చెక్ పెట్టిందని తెలిపారు. ఎన్నికలు ఆపాలన్న వైసీపీ ట్రాప్ లో పడబోమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానిచిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కూటమి ప్రజలను, వారి నమ్మకాన్ని మాత్రమే విశ్వసించిందని, వైసీపీ మాత్రం హింసాత్మక రాజకీయాలను నమ్ముకుందని విమర్శించారు. రక్తతర్పణాలు, రప్పరప్పా రాజకీయాలను ప్రజలు ఎప్పుడూ ఆమోదించరని, రౌడీయిజం, డ్రామాలతో ప్రజాతీర్పును మార్చలేరని అన్నారు. రెండు తుఫాన్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలోనూ వైసీపీ కనీసం రాజకీయ పార్టీగా స్పందించలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో మావిగన్ ప్రకటనకు కూడా ప్రజలు తమ తీర్పు ద్వారా సమాధానం ఇచ్చారని వ్యాఖ్యానించారు. డబ్బు ప్రభావం లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ అభినందనలు తెలిపారు. గెలిచిన వారిపై ప్రజల పట్ల బాధ్యత మరింత పెరిగిందని, ఎన్నికలతో తమ బాధ్యత ముగిసిపోలేదని, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటామని చెప్పారు.
సాఫీగా సాగిన ఎన్నికల ప్రక్రియ… అయినా విమర్శలా..?
ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారు ప్రజాతీర్పును గౌరవిస్తారని, నమ్మకం లేని వారే కుట్రలకు పాల్పడతారని వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగినప్పటికీ వైసీపీ అర్థం పర్థం లేని ఆరోపణలు చేసిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములను సహజంగా స్వీకరించాలన్నారు. కుప్పంలో ఒక ఎంపీటీసీ స్థానాన్ని కూటమి కోల్పోయినప్పటికీ, కక్కుర్తి పడలేదని వెల్లడించారు. దాన్ని బలవంతంగా కైవసం చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలనే పంతానికి పోలేదని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తేనే అసలైన ప్రజాభిప్రాయం తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలనే తమ విధానానికి కుప్పం ఎంపీటీసీ ఫలితమే నిదర్శనమని ముఖ్యమంత్రి చెప్పారు.
శ్వేతపత్రాలు టు ప్రగతి నివేదికలు
గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించేందుకు శ్వేతపత్రాలు విడుదల చేశామని, వ్యవస్థలను గాడిలో పెట్టి ఇప్పుడు ప్రగతి నివేదికలు సమర్పిస్తున్నామన్నామన్నారు. రాయలసీమను అభివృద్ధి సీమగా మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలను తీసుకొచ్చామని, సూపర్ ఎల్‌నినో వంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 36 ప్రాజెక్టులను పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టామని చెప్పారు. రాష్ట్రానికి పూర్తిగా దెబ్బతిన్న బ్రాండ్‌ను తిరిగి సూపర్ బ్రాండ్‌గా తీర్చిదిద్దామని తెలిపారు. ఒకసారి రాష్ట్రానికి మంచి బ్రాండ్ ఇమేజ్ వస్తే పెట్టుబడులు వాటంతట అవే వస్తాయని చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పు తమకు మరింత బాధ్యతను పెంచిందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనను కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనూ రాజకీయాల కంటే ప్రజల కష్టాలకే ప్రాధాన్యమిచ్చామని, ఈ విషయాన్ని ప్రజలు గమనించారని ముఖ్యమంత్రి చెప్పారు.
