ఆరవల్లి-భీమవరం టౌన్-నరసాపూర్ మధ్య
విద్యుదీకరణతో సహా డబుల్ రైల్వే లైన్ను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే
దీనితో విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్-నర్సాపూర్ & గుడివాడ-మచిలీపట్నం మరియు భీమవరం టౌన్-ఆరవల్లి మధ్య 186 కిమీల మేర విద్యుదీకరణతో సహా డబుల్ రైల్వే లైన్ అనుసంధానం అందుబాటులోకి వచ్చింది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే భీమవరం టౌన్-నర్సాపూర్ & భీమవరం టౌన్-ఆరవల్లి మధ్య 45 కిమీల మేర డబుల్ లైన్ మరియు ఎలక్ట్రిక్ ట్రాక్షన్ పనులను పూర్తి చేసి ప్రారంభించింది. ఈ సెక్షన్లలో విద్యుదీకరణతో సహా డబ్లింగ్ పనులు ప్రారంభించడంతో విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్-నర్సాపూర్ & గుడివాడ-మచిలీపట్నం మరియు భీమవరం టౌన్-ఆరవల్లి మధ్య 186 కిమీల దూరం నిరంతరంగా విద్యుదీకరణతో సహా డబుల్ లైన్ రైల్వే అనుసంధానం ఏర్పాటు అయ్యింది. దీనితో, ప్రస్తుతం ఆరవల్లి-నిడదవోలు మధ్య 35 కిమీల కొంత భాగం మినహా ప్రాజెక్టు మొత్తం డబుల్ లైన్తో నిర్వహించబడుతుంది.
విజయవాడ-గుడివాడ-భీమవరం-నర్సాపూర్, గుడివాడ-మచిలీపట్నం & నర్సాపూర్-నిడదవోలు డబ్లింగ్ మరియు విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా భీమవరం టౌన్-నర్సాపూర్ & భీమవరం టౌన్-ఆరవల్లి మధ్య ఈ సెక్షన్లో విద్యుదీకరణతో సహా డబ్లింగ్ లైను ప్రారంభమైంది. రూ. 3,000 కోట్ల అంచనా వ్యయంతో 221 కిమీల దూరం గల ఈ ప్రాజెక్టు 2011-12 సంవత్సరంలో మంజూరైంది మరియు ఆర్విఎన్ఎల్ (రైల్ వికాస్ నిగం లిమిటెడ్) వారిచే నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతంలో ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మరియు దీనితో ఈ ప్రాంత అభివృద్ధికి బలోపేతం చేకూరుతుంది.
మొత్తం 221 కిమీల పొడవుగల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 186 కిమీల మేర పనులు పూర్తయ్యి ప్రారంభించబడిరది. 35 కిమీల దూరం గల ఆరవల్లి ` భీమవరం టౌన్ సెక్షన్లో మిగిలిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి మరియు అవి చివరి దశలో ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుతో ప్రయోజనాలు
-ఈ ప్రాజెక్టుతో సరుకు రవాణా మరియు ప్రయాణికుల రాకపోకలు నిరాటంకంగా సాగడం ద్వార రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో మరియు అనుసంధానంలో గణనీయమైన పటిష్టత చేకూరుతుంది.
-నూతన డబుల్ రైల్వే లైను ద్వారా రైలు రవాణా మెరుగవుతుంది మరియు రైలు రవాణాకు సంబంధించి ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది.
-ఈ ప్రాంతంలోని వనరులైన వ్యవసాయ మరియు ఆక్వా ఉత్పత్తుల రవాణా సులభతరమవడంతో ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది.
-విద్యుదీకరణ పనులతో కార్బన్ ఉద్గారాలు తగ్గడమే కాకుండా ఇంధనం కూడా ఆదా అవుతుంది మరియు ఇంధన ఖర్చు తగ్గుతుంది.
-ఈ లైను ద్వారా విజయవాడ-విశాఖపట్నం మధ్య కోస్తా రైల్ కారిడార్ కోసం అనుకూలమైన ప్రత్యామ్నాయ రైల్వే లైనుగా సేవలందించవచ్చు.
ఆరవల్లి-భీమవరం టౌన్-నర్సాపూర్ సెక్షన్ మధ్య విద్యుదీకరణతో సహా డబుల్ లైన్ ఏర్పాటుకు కృషి చేసిన విజయవాడ డివిజన్ & ఆర్విఎన్ఎల్ అధికార, సిబ్బంది బృందాలన్నింటినీ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజీవ్ కిశోర్ అభినందించారు. ప్రాజెక్టులో మిగిలిన భాగాలలో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జనరల్ మేనేజర్ వారికి సూచించారు. కీలకమైన ఈ డబ్లింగ్ లైన్ పనులతో ప్రయాణికులకు నిరాటంక రాకపోకలను కల్పించడమే కాకుండా తక్కువ రవాణా ఖర్చుతో ఇక్కడి ఉత్పత్తులను నూతన ప్రాంతాలలో మార్కెటింగ్ చేసుకునేందుకు అపారమైన అవకాశాలుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.