-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా ఫుట్ బాల్ టోర్నీ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకే సీఎం కప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు జిల్లా స్థాయి సీఎం కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు, ఫుట్ బాల్ ఆడి వారిలో ఉత్తేజాన్ని నింపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల బడ్జెట్ లో క్రీడా రంగానికి చేసిన కేటాయింపులే ఇందుకు నిదర్శనమన్నారు. క్రీడల ద్వారా యువత అనేక ఉద్యోగావకాశాలు పొందే అవకాశముంటుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగాలలో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. జీవో నెం. 74 ని కూడా తీసుకురావడం జరిగిందన్నారు. దీని ద్వారా 2019-20, 2020-21 సంవత్సరాలలో 2,500 మంది పలు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగావకాశాలు పొందినట్లు వెల్లడించారు. వీటితోపాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో తప్పనిసరిగా మైదానాలు ఉండాలని.. నాణ్యమైన చదువుతోపాటు క్రీడల్లో యువత రాణించేలా తర్ఫీదునివ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని తెలిపారు. కృష్ణా జిల్లా అంటేనే క్రీడాకారులకు పుట్టినిల్లు అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అభివర్ణించారు. వారి స్ఫూర్తితో యువత క్రీడలలో విజయాలు సాధించాలన్నారు. క్రీడాకారులకు కావలసిన సదుపాయాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం, నగర పాలక సంస్థ సహకారంతో సమకూర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగపరచుకొని క్రీడాకారులు అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షించారు. మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే క్రీడాకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కుక్కల అనిత, పెనుమత్స శిరీష సత్యం, చీఫ్ కోచ్ శ్రీనివాస్, జిల్లా కోచ్ రవికుమార్, మురళీకృష్ణంరాజు, క్రీడాకారులు పాల్గొన్నారు.