-త్వరలో ప్రమోషన్లు, బదిలీలు
-టీచర్ ఎమ్మెల్సీలతో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మున్సిపల్ స్కూళ్లలోని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీలతో సచివాలయంలోని తన చాంబర్ లో మంగళవారం నాడు ప్రత్యేకంగా సమావేశమై మున్సిపల్ స్కూళ్ల స్థితిగతులపై సమీక్షించారు.
ఎమ్మెల్సీలు వి. బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, పి.రఘువర్మ, కల్పలత, షేక్ సాబ్జీ, శ్రీనివాసులు రెడ్డి , ఐ. వెంకటేశ్వరరావు తోపాటు పురపాలక శాఖ కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు ఇచ్చిన విజ్ఞాపన పత్రంలోని అంశాలపై చర్చిస్తూ, వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
టీచర్లకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ , ప్రమోషన్లు, బదిలీలు , హైస్కూళ్ల హెడ్ మాస్టర్లకు బాధ్యతలు (డ్రాయింగ్ అండ్ డిసర్బస్ మెంట్ ఆఫీసర్లుగా), ఖాళీల భర్తీ తోపాటు, అప్ గ్రేడేషన్ అయిన స్కూళ్లకు పోస్టుల మంజూరు వంటి అంశాలను ఎమ్మెల్సీలు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. కొన్ని జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయికి పెంచినట్లే, మున్సిపల్ స్కూళ్లను కూడా అప్ గ్రేడ్ చేయాలని వారు కోరారు.
నూతన విద్యావిధానం 2020 ప్రకారం ప్రస్తుతం మున్సిపల్ స్కూళ్ల మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతున్నదని, అది పూర్తి అయిన తరువాత సిబ్బంది కొరత, అప్ గ్రేడేషన్ వంటి సమస్యలు పరిష్కారమవుతాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను పరీక్షలు పూర్తి అయిన తరువాత చేపడతామన్నారు. హైస్కూళ్ల హెడ్ మాస్టర్లకు డిడిఒ బాధ్యతలను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. ప్రావిడెంట్ ఫండ్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని చూపాలని కమిషనర్ నాయక్ ను ఆదేశించారు.