విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవం విజయవాడ గాంధీ నగర్ లోని చాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ నందు ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేయగా, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వేల్లంపల్లి శ్రీనివాసరావు,MLC రూహల్ల అసోసియేషన్ లోగో ఆవిష్కరించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్, సిపిఎం నాయకులు సిహెచ్ బాబూరావు, అమ్మిశెట్టి వాసు, మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఈ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుపుకోవడం చాలా శుభసూచకమని, జర్నలిస్టులకు తమ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, అసోసియేషన్ ద్వారా ఎటువంటి సమస్య వచ్చినా తమ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
ఎమ్మెల్సీ రుహుల్ల మీడియాతో మాట్లాడుతూ నా రాజకీయ జీవితం గత 12 సంవత్సరాలుగా జర్నలిస్టు మిత్రుల తోనే గడిచిందని, జర్నలిస్టుల అంటే తనకు ఎంతో గౌరవమని, వారికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ జర్నలిస్టుల అభ్యున్నతికి, వారి సమస్యల పరిష్కారానికి, జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అసోసియేషన్ అందుబాటులో ఉంటుందని, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సోదరులకు మా అసోసియేషన్ ఎప్పుడు అండగా ఉంటుందని, త్వరలోనే అసోసియేషన్ సభ్యత్వాలు నమోదు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమరావతి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ , ప్రధాన కార్యదర్శి మధుసూదన కుమార్ ఇతర కార్యవర్గ సభ్యులు, వివిధ చానళ్లు, పత్రికలకు సంబంధించిన సంపాదకులు, మరియు జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు.