-సీతారాముల కళ్యాణం చూతము రారండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్వహణలోని ఒంటిమిట్ట (కడప) శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో నిర్వహించే శ్రీరామనవమి భ్రహ్మోత్సవాలకు విచ్చేసి స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరించందన్ కు తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులు స్వాగతం పలికారు. శుక్రవారం రాజ్ భవన్ కు వచ్చిన దేవస్ధానం అధికారులు, పండితులు గవర్నర్ కు ఆహ్వాన పత్రికను అందచేసి దేవాలయ చరిత్ర, వైభవాన్ని గురించి వివరించారు. ఈ నెల పదవతేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, 19వ తేదీ వరకు జరగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్ధానం, ఒంటిమిట్ట రామాలయం ఉప కార్యనిర్వహణ అధికారి డాక్టర్ రాపూరి రమణ ప్రసాద్ తెలిపారు. పదిహేనవ తేదీన స్వామి వారి కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. కడప జిల్లాలోని ఒంటిమిట్టను ఏకశిలా నగరం కూడా పిలుస్తారని శతాబ్దాల నాటి ఈ దేవాలయంకు విచ్చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేదపండితులు గవర్నర్ ను ఆశీర్వదించి తీర్దప్రసాదాలు అందచేసారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, దేవస్దానం నుండి బివిఎల్ గోపాల్ అచార్య, ఎంవి శాస్త్రి, డి సాంబశివ శర్మ, దొరస్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.