అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో నగరపాలక సంస్థ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

-ఇంచార్జ్ కమిషనర్ ఏ. రవీంద్రరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
అక్వాన్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఇంచార్జ్ కమిషనర్ ఏ. రవీంద్రరావు ఆదేశించారు. తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం సిబ్బందికి విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో వర్షాలు కురిసే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట మోటార్ల ద్వారా నీటిని తొలగించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పునరావాస కేంద్రాలను ముందుగానే సిద్ధం చేయాలని తెలిపారు.

కొండవాలు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు తుఫాన్ ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, ప్రమాదకర పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తుగా గుర్తించి సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.

నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌లో సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని, ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఇంచార్జ్ కమిషనర్ స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.