విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్‌కు చెందిన నావల్ వింగ్ క్యాడెట్ల కోసం ప్రతిష్టాత్మకమైన ఎన్సీసీ ఆల్ ఇండియా నావల్ సెయిలింగ్ ఎక్స్‌పెడిషన్ (MENU–2026) నిర్వహించనున్నారు. 2026 డిసెంబర్ 1 నుంచి 12వ తేదీ వరకు ఒడిశాలోని చిలికా సరస్సులో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ ఎక్స్‌పెడిషన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం 85 మంది ప్రతిభావంతులైన ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొననుండగా, వారిలో 35 మంది బాలికా క్యాడెట్లు ఉండటం విశేషం.
ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి నవంబర్ 16న ప్రణాళికా సమీక్ష సమావేశం నిర్వహించారు. కాకినాడ ఎన్సీసీ గ్రూప్ హెడ్‌క్వార్టర్స్ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎక్స్‌పెడిషన్ ఏర్పాట్లు, శిక్షణ, నిర్వహణకు సంబంధించిన అంశాలను సమీక్షించారు.
ఈ ఎక్స్‌పెడిషన్‌లో భాగంగా నవంబర్ 16 నుంచి 30వ తేదీ వరకు విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో ఎన్సీసీ క్యాడెట్లు పలు సామాజిక సేవ, కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా క్యాడెట్లకు సమాజం పట్ల, ప్రజల అవసరాల పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం అలవడతాయని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా 8 ఆంధ్ర నావల్ యూనిట్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ సుజీత్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు యువతలో సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత నావికాదళంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందేందుకు కూడా ఈ తరహా శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయని తెలిపారు.
చిలికా సరస్సులో ఎన్సీసీ ఆల్ ఇండియా నావల్ సెయిలింగ్ ఎక్స్‌పెడిషన్ – 2026
