పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

– నామినేషన్ల ప్రక్రియ నుంచి ప్ర‌తి అంశంపైనా నిరంతర పర్యవేక్షణ
– ఎన్నికల సంఘం మార్గదర్శకాల కచ్చిత అమ‌లుకు కృషి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల వరకు ప్రతి అంశంపై ప్రత్యేకంగా దృష్టిసారించి, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.
మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు, ఎన్నికల నిబంధనల అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తొలివిడతలో జిల్లాలో 73 గ్రామ పంచాయతీలు, 856 వార్డులకు సంబంధించి 1,001 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ నెల 26న తొలి విడత పోలింగ్ నిర్వహించడంతో పాటు అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ల‌క్ష్మీశ‌ స్పష్టం చేశారు.