బాలల హక్కులను అనుభవిస్తూ ప్రాథమిక విధులు నిర్వర్తించాలి: సిస్టర్ విద్యా

తుళ్లూరు, నేటి పత్రిక ప్రజావార్త:
బాలలు తమ హక్కులను అనుభవిస్తూనే ఇతరుల హక్కులకు భంగం కలగకుండా ప్రాథమిక విధులను బాధ్యతగా నిర్వర్తించాలని గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సిస్టర్ విద్యా అన్నారు.
తుళ్లూరు ఎంపీడీవో కార్యాలయంలో నవంబర్ 17న గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘బాలల హక్కులు – ప్రాథమిక విధులు’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంటూరు డీసీపీఓ సీహెచ్. విజయ్ కుమార్ మాట్లాడుతూ బాలలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రతి పౌరుడి ప్రాథమిక విధుల గురించి వివరించారు. రాజ్యాంగం, జాతీయ చిహ్నాలను గౌరవించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడం వంటి బాధ్యతలను విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు.
సిస్టర్ విద్యా మాట్లాడుతూ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు విద్యావకాశాలు కల్పించడం తల్లిదండ్రుల బాధ్యతని, చదువు, క్రీడల్లో రాణిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. హక్కులు, విధులు ఒకే నాణేనికి బొమ్మా బొరుసు వంటివని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చైల్డ్‌లైన్ జిల్లా కోఆర్డినేటర్ కె. శ్రీనివాసరావు, ఎస్‌ఐ, వైద్యాధికారిణి డాక్టర్ శివపార్వతి, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళా పోలీసులు, ఏఎన్‌ఎంలు, సచివాలయ సిబ్బంది, గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.