అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ (ఎపిఇఆర్సి) చైర్ పర్సన్ గా బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 3వతేదీన జిఓఎంఎస్ సంఖ్య 87 ద్వారా ఎపిఇఆర్సి చైర్ పర్సన్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ (Binoy Kumar)ను నియమించడంతో గురువారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ బినోయ్ కుమార్ తో చైర్ పర్సన్ గా ప్రమాణం చేయించారు.ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఐదేళ్ళ కాలం లేదా 70 సంవత్సరాలు వయస్సు నిండే వరకూ ఏది ముందైతే అది ఆప్రకారం పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఆఉత్తర్వుల్లో పేర్కొంది.
ఎపి ఇఆర్‌సి చైర్ పర్సన్ గా ప్రమాణం చేసిన బినోయ్ కుమార్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.అదే విధంగా ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు సియం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సహా ఇతర అధికారులు బినోయ్ కుమార్ కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈకార్యక్రమంలో జెన్కోఎండి నాగలక్ష్మి,సిపిడిసిఎల్ సిఎండి పి.పుల్లారెడ్డి,జెఎండి ట్రాన్స్‌కో సూర్య సాయి ప్రవీణ్ చంద్,ఎపిఇఆర్సి సభ్యులు పివిఆర్ రెడ్డి,ఎపి నెరెడ్క్యాప్ విసి అండ్ ఎండి కమలాకర్ బాబు,ఎపిఇఆర్సి కార్యదర్శి పి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎపిఇఆర్సి చైర్ పర్సన్ గా బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారం
