బ్లో అవుట్ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా

-ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం
-వరుస బ్లో అవుట్ ఘటనల నేపథ్యంలో భద్రతా చర్యలపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని దిశా నిర్దేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం నగరం గ్రామ పరిధిలోని తాడివారిమెరక సమీపంలో ఓఎన్జీసీ గ్యాస్ డ్రిల్లింగ్ బావి వద్ద చోటుచేసుకున్న బ్లో అవుట్ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. తీవ్రత, పరిసర గ్రామాల ప్రజల భద్రత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఒక్కసారిగా గ్యాస్ వెలువడినట్లు కలెక్టర్ తెలిపారు. గ్యాస్ లీకేజీ ప్రాంతానికి కిలోమీటరు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలందరినీ నగరంలోని పునరావాస కేంద్రానికి తరలించినట్లు వివరించారు. ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఓఎన్జీసీ సాంకేతిక బృందం బావి వద్దకు చేరుకుని గ్యాస్ లీకేజీని అరికట్టే ప్రయత్నాలు ప్రారంభించినట్లు, మరో ఐదు గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఇటీవల తరచూ గ్యాస్ లీకేజీ ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఓఎన్జీసీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.