-ప్రపంచ బ్యాంకు, హడ్కో ప్రతినిధులను కోరిన కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
రాజధాని ప్రాంతంలోని కీలక నగరమైన గుంటూరును ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు చేపట్టనున్న బృహత్తర అభివృద్ధి పనులకు పూర్తి స్థాయిలో సహకరించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ప్రపంచ బ్యాంకు, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ప్రతినిధులను కోరారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో ప్రపంచ బ్యాంకు, హడ్కో ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నగర రూపురేఖలను మార్చే ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఈ భేటీలో చర్చించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగర ప్రజలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసిందని వెల్లడించారు. ముఖ్యంగా నగరంలో పారిశుధ్య, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు రూ. 300 కోట్ల భారీ వ్యయంతో సీవరేజ్ యుటిలిటీ సదుపాయాల కల్పన, వ్యాపార వర్గాలు మరియు ప్రజల అవసరాలకు అనుగుణంగా రూ. 118 కోట్లతో అత్యాధునిక హంగులతో కూడిన పి.వి.కె. నాయుడు మార్కెట్ నిర్మాణం, అలాగే నగరంలోని తాగునీటి సరఫరా మరియు ఇతర యుటిలిటీ సేవలను సాంకేతిక పరిజ్ఞానంతో సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు రూ. 53.65 కోట్లతో స్కాడా వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వివరించారు. ఇదే సమయంలో గుంటూరు నగరపాలక సంస్థ ఆర్థిక క్రమశిక్షణ, ప్రగతి గురించి ప్రతినిధులకు వివరిస్తూ, జీఎంసీ ఆదాయంలో ప్రతి ఏటా 8 నుండి 15 శాతం వరకు స్థిరమైన వార్షిక వృద్ధి రేటు నమోదవుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆడిట్ ప్రక్రియలు కూడా ఎప్పటికప్పుడు సకాలంలో పూర్తవుతున్నాయని తెలిపారు. నగర అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన కార్యరూపం దాల్చేందుకు ప్రపంచ బ్యాంకు మరియు హడ్కో సంస్థలు సంపూర్ణ ఆర్థిక, సాంకేతిక సహకారం అందించాలని ఆకాంక్షించారు.
సమావేశంలో ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఏఓ జి.తిరుపతి నాయుడు, ప్రపంచ బ్యాంకు మరియు హడ్కో సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
