-పోలవరం పూర్తిచేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది.
-కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రమ్ వాల్ పూర్తిచేస్తారా…?
-గత ప్రభుత్వ తప్పిదాలతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్లనే పోలవరం ఆలస్యానికి కారణం..
-వివరాలను వెల్లడించిన జలవనులు శాఖ మంత్రి అంబటి రాంబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే ముంపు ప్రాంతాలకు వరదల సమయంలో ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్ళలేదని, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి వరద బాధితులకు అండగా నిలిచిందని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడ బాధితులకు అందిన సహాయక చర్యలపై ఆరా తీశారని, బాధితులందరూ సంతృప్తి వ్యక్తం చేసి ప్రభుత్వ చర్యలను శభాష్ అంటూ కొనియాడిన సంఘనలు చోటుకున్నాయని వివరించారు. అనూహ్య వరదలతో ఎటువంటి ప్రాణం నష్టం జరగకుండా చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేసిందన్నారు. గోదావరి ఉధృతితో భారీ నష్టం జరిగిందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి గత ప్రభుత్వ నిర్ణయాలే కారణమని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, దశల వారీగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని తెలిపారు. విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో శనివారం నాడు మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ… ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా జూలై మొదటి వారంలోనే గోదావరికి ఉదృతంగా వరదలు వచ్చాయని.. ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. గతంలో ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు జాయింట్ కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు మాత్రమే ఉండేవారని, కానీ జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలతో సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగుల అందరూ కలిసి వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారన్నారు. వరదబాధితులకు పునరావాసం కల్పించి, రూ.2 వేల తక్షణ ఆర్థిక సహాయం అందించామన్నారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. ప్రతిపక్షం ప్రభుత్వంపై బురదజల్లడం తగదని హితవు పలికారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ప్రతిపక్ష నేత రెచ్చగొట్టడం సరికాదన్నారు. 1986లో భద్రాచలంలో కరకట్ట కట్టానని ప్రతిపక్ష నేత గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్సదం అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయలేకపోయిందో ప్రతిపక్ష నేత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం కట్టాల్సిన జాతీయ ప్రాజెక్టును గత ప్రభుత్వం ఎందుకు తీసుకుందో కూడా సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ప్రభుత్వం 2018లో పోలవరం నుండి నీళ్లిస్తాం.. పూర్తిచేస్తామని చెప్పలేదా ప్రశ్నించారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తారా? అని నిలదీశారు. పోలవరం డ్యామ్ ఎత్తుపై కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. డ్యాం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్లే 2021 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయామని, ఈ తప్పు గత ప్రభుత్వానిదేనని మంత్రి అన్నారు. 41.15 అడుగుల ఎత్తు వరకూ మొదటి దశలో పూర్తిచేసి నీటిని నిల్వచేస్తామని.. తర్వాత 45.72 అడుగుల ఎత్తు వరకూ రెండో దశలో పనులు చేసి పోలవరం లక్ష్యాన్ని పూర్తిచేస్తామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు సహాయ పునరావాస చర్యలు వచ్చే నాలుగు నెలల్లోగా పూర్తి చేస్తామని జలవనరుల శాఖా మంత్రి శ్రీ అంబటి రాంబాబు అన్నారు.