-బీఎన్ఐ వేదికగా అభివృద్ధి పథంలో వ్యాపారులు
-ఒకరికొకరు తోడుగా బీఎన్ఐ సభ్యుల సమగ్రాభివృద్ధి
-కోవిడ్ విపత్తులోనూ సడలని స్ఫూర్తి
-విజయవంతంగా బీఎన్ఐ ‘చరిత్ర’
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరస్పర సహకారంతో వాణిజ్యాభివృద్ధి సాధ్యమని బీఎన్ఐ జాతీయ అధ్యక్షులు హేము సువర్ణ పేర్కొన్నారు. బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్ఐ) విజయవాడ, గుంటూరు మెంబర్స్ డే వేడుక ‘బీఎన్ఐ చరిత్ర’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక సీకే కన్వెన్షన్ నందు బీఎన్ఐ చరిత్ర పేరుతో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఎన్ఐ సభ్యులు, రెండు నగరాలకు చెందిన అగ్రశ్రేణి వాణిజ్యవేత్తలు, వివిధ రంగాల ప్రముఖ్యలు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం బీఎన్ఐ జాతీయ అధ్యక్షులు హేము సువర్ణ ప్రసంగిస్తూ.. వ్యాపారంలో పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ కలిసి పురోగమించడమే బీఎన్ఐ లక్ష్యమని తెలిపారు. కోవిడ్-19 విపత్తు కారణంగా వ్యాపారరంగం కుదేలయిందని, వాణిజ్యవేత్తలు అన్ని విధాలుగా సమస్యలను ఎదుర్కోవలసివచ్చిందని అన్నారు. అంతటి విపత్కర పరిస్థితుల్లో సైతం బీఎన్ఐ సభ్యులు సంఘటితంగా ముందుకు సాగటం అభినందనీయమని కొనియాడారు. కేవలం వ్యాపార ప్రగతికి సహాయ సహకారాలు అందించడమే కాకుండా, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సైతం ఒకరికొకరు అండగా నిలవడం బీఎన్ఐ స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. బీఎన్ఐ సభ్యులు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, పరస్పరం వ్యాపారావకాశాలను అందిపుచ్చుకుని సమగ్రాభివృద్ధి సాధించాలని హేము సువర్ణ ఆకాంక్షించారు. బీఎన్ఐ సీనియర్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ మురళీ శ్రీనివాసన్ మాట్లాడుతూ కోవిడ్ వంటి మహా విపత్తు అనంతరం బీఎన్ఐ విజయవాడ, గుంటూరు సభ్యుల సదస్సును నిర్వహించడం అభినందనీయమని అన్నారు. బీఎన్ఐ చరిత్ర పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వాణిజ్య రంగ చరిత్ర సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్, గుంటూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కిరణ్ బాబు పీటర్, శేఖర్ బాబు, బీఎన్ఐ విజయవాడ, గుంటూరు ముఖ్య ప్రతినిధులు యడ్ల పార్థసారథి, ఎన్. సందీప్, బి. మురళీ సతీష్ కుమార్, బి. సురేన్ కుమార్, త్రినాథ్ నండూరి, విద్యాసాగర్ పావులూరి, టి. వినోద్, వి. రమాకాంత్, వి. ప్రశాంత్, కె. సుబ్బారావు, ఎ. దినేష్, మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ ప్రతినిధి డాక్టర్ రామ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.